బిడ్డ జననం కోసం ఎంతో ఆశగా ఆ గిరిజన దంపతులు ఎదురుచూశారు.. కానీ ఆ ఆశలు బిడ్డ పుట్టిన గంటల్లోనే ఆవిరయ్యాయి.. దీంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిన ఆ గిరిజన జంటకు మరో కన్నీటి కష్టం ఎదురైంది. శిశువు మృతదేహాన్ని తరలించేందుకు.. మూడు వాహనాలు మారి కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది.
గూడెంకొత్తవీధి మండలం చిన్న అగ్రహారంకు చెందిన వంతల లక్ష్మి గర్భిణీ. పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరింది. శనివారం(ఆగస్టు 2) రాత్రి ఆమె గూడెంకొత్తవీధి ఆసుపత్రిలో పాపకు జన్మనిచ్చింది. బిడ్డ శరీరం క్రమంగా రంగు మారుతుండటంతో ఆ జంట ఆందోళన చెందింది. దీంతో అత్యవసర వైద్యం కోసం చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడి మరింత మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి అంబులెన్సులో తీసుకెళ్లారు. పరిస్థితి మరింత విషమించి ఆ శిశువు మృతి చెందింది. మరుసటి రోజు ఉదయం మృతశిశువును తరలించేందుకు అంబులెన్స్ కోసం ఎదురుచూశారు. తల్లికి రక్తస్రావం అవుతుండటంతో ఆసుపత్రిలోనే ఉంచాలని.. చనిపోయిన శిశువును తీసుకు వెళ్లాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పారని బాధితురాలి భర్త బుజ్జిబాబు భోరుమన్నాడు.
దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లీ, మృత శిశువుని ఇద్దరినీ తీసుకుని చింతపల్లి వరకు 50 కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులో, అక్కడి నుంచి జీకేవీధికి 20 కిలోమీటర్లు ఆటోలో ప్రయాణించారు. ఆపై స్వగ్రామం వరకు మరో 20 కిలోమీటర్లు టూ వీలర్ పై తరలించాల్సి వచ్చిందని వాపోయారు దంపతులు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. గుండె తరుక్కుపోయే ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఆరా తీస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..