అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో ఆ 11 గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ఆ ఆదివాసీలు కష్టాలు అన్నీ కావు. అత్యవసరమైనా అనారోగ్యమైనా.. కిలోమీటర్లు నడవాల్సిందే.. డోలి కట్టాల్సిందే.. రోడ్డు కోసం అధికారుల చుట్టూ తిరిగారు.. కనిపించిన నేతలను విన్నవించారు. ఎట్టకేలకు వీరి కల సాకారం అయ్యే రోజు వచ్చింది. రోడ్డు పనులు ప్రారంభించడంతో గిరిజనులంతా ఆనందంతో ఉబ్బితబ్బిఐయ్యారు. దింసా నృత్యం చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. భూమి పనులు ప్రారంభించిన పొక్లైన్‌కు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతగిరి మండలం జీనపాడు, పెదకోట, పిన్నకోట తదితర పంచాయతీల పరిధిలో 11 కొండ శిఖర గ్రామాలున్నాయి. సుమారు 2 వేల మంది జనాభా నివసిస్తున్నారు. బల్లగరువు నుంచి వాజంగి మీదుగా, దాయర్తి నుంచి మడ్రేబు మీదుగా తునిసీబు వరకు 12కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణం కోసం నిధులు విడుదలయ్యాయి. జనవరి నెలలోనే నిధులు మంజూరు అయినప్పటికీ.. పనులు ప్రారంభం కాలేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. గతేడాది డిసెంబర్ 20న బల్లగరువు నుంచి వాజంగి వరకు నడక దారిన వెళ్లి గిరిజనుల కష్టాల్ని స్వయంగా చూశారు. గుమ్మంతి నుంచి రాచకియం వయా రెడ్డిపాడు వరకు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన కూడా చేశారు. అయినా పనులు ప్రారంభం కాలేదు.
మళ్ళీ మా పరిస్థితి అంతేనా.. సమస్య మొదటి వచ్చిందా అని ఆ గిరిజనులు ఆందోళన చెందారు. ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఎనిమిది నెలలకు పనులు ప్రారంభమయ్యాయి. దీంతో మా గ్రామానికి రోడ్డు వస్తుందోచ్ అంటూ 11 గ్రామాల గిరిజనులు ఆనందంతో దింసా డాన్స్ చేశారు. రోడ్డు నిర్మాణ పనుల కోసం వచ్చినప్పుడు ప్రొక్లేయిన్ కు పూజలు చేశారు. రోడ్డు రావడానికి ప్రత్యేక శ్రద్ధ చూపిన పవన్ కల్యాణ్‌ను ధన్యవాదాలు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..