సత్యసాయి జిల్లాలో పెళ్లికూతురు ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉదయం పెళ్లి జరిగితే సాయంత్రానికి వధువు బలవన్మరణానికి పాల్పడటం సంచలనం రేపింది. సోమందేపల్లిలో ఈ ఘటన జరగ్గా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందనే వివరాలను ఎస్ఐ రమేష్ బాబు వెల్లడించారు. వధువు తల్లిదండ్రులు తెలియజేసిన వివరాలను వెల్లడించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. హర్షిత కుటుంబసభ్యులతో మాట్లాడిన అనంతరం కీలక వివరాలను వెల్లడించారు. సోమవారం నాగేంద్ర, హర్షితలకు వివాహం జరిగిందని.. శోభనం ఏర్పాట్ల కోసం సోమవారం సాయంత్రానికి కొత్త జంట ఇద్దరూ కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి హర్షిత ఇంటికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే సోమవారం సాయంత్రం ఈ పెళ్లి తనకు ఇష్టం లేదనే సంగతిని హర్షిత.. తన తల్లిదండ్రులకు తెలియజేసిందని ఎస్ఐ రమేష్ బాబు వివరించారు.
దీంతో ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు.. పెళ్లి జరిగిపోయిన తర్వాత ఈ విషయం చెప్తే అందరిలో పరువు పోతుందని హర్షితకు నచ్చజెప్పారు. అయితే తల్లిదండ్రుల పరువు పోతుందనే భయంతోనే పెళ్లికి అంగీకరించానని చెప్పిన హర్షిత.. కాసేపు రెస్ట్ తీసుకుంటానంటూ గదిలోకి వెళ్లింది. అయితే అరగంట గడిచినా బయటకు రాకపోవటంతో ఇంట్లోని వారు.. గడియ విరగ్గొట్టి చూస్తే చీరతో ఉరి వేసుకుని కనిపించింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే అంబులెన్సులో పెనుకొండ ఆస్పత్రికి తరలించగా అప్పటికే హర్షిత చనిపోయినట్లు వైధ్యులు ధ్రువీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
రెండు నెలల కిందట జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటే తల్లిదండ్రుల పరువు పోతుందనే కారణంతోనే పెళ్లి చేసుకున్నట్లు హర్షిత సోమవారం సాయంత్రం తమకు చెప్పిందని హర్షిత తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. మరోవైపు ఉదయం పెళ్లి జరిగి.. కాళ్లపారాణి ఆరకముందే పెళ్లి కూతురు చనిపోవటం.. ఆ రెండు కుటుంబాలలో తీవ్ర ఆవేదనను మిగిల్చింది. కొత్త జీవితం మొదలెడదామని అనుకున్న వరుడి కలలు. కొత్త కోడలు వస్తోందన్న ఆ కుటుంబం ఆశలు ఇలా విషాదమయం కావటం ఒకటైతే.. తల్లిదండ్రుల పరువు పోతుందనే భయంతో నచ్చని పెళ్లి చేసుకుని ఇలా సాయంత్రానికి విగతజీవిగా మారడం హర్షిత కుటుంబంలో తీరని వేదనను మిగిల్చింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.