జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. స్టాండింగ్ కమిటీలోని పది స్థానాలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి 9 స్థానాలలో విజయం సాధించగా.. వైసీపీ ఒక స్థానం దక్కించుకుంది. అయితే గతేడాది జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయగా.. ఈసారి ఒక స్థానంలో వైసీపీ గెలుపొందటం విశేషం.

బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ ఓటింగ్ జరిగింది. మొత్తం 92 మంది జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. అయితే క్రాస్ ఓటింగ్ జరగటంతో టీడీపీ కూటమి ఒకస్థానంలో ఓడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది పది స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయగా.. ఈసారి ఓ స్థానం కోల్పోవటంతో సమీక్షించుకుంటామని కూటమి నేతలు చెప్తున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలుపొందటంతో జీవీఎంసీ వద్ద కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
మరోవైపు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో ఎన్డీఏ కూటమికి 64 మంది కార్పొరేటర్ల మద్దతు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 31 మంది కార్పొరేటర్ల బలం ఉంది. వామపక్షాలకు ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. ఒక్కొక్కరికి పది ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీలో పది స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికల కోసం కూటమి నుంచి 10 మంది, వైసీపీ నుంచి 10 మంది పోటీ చేశారు. అయితే కూటమి నుంచి 9 మంది, వైసీపీ నుంచి ఒకరు గెలుపొందారు. స్టాండింగ్ కమిటీ పదవీ కాలం ఏడాది పాటు ఉంటుంది. ఏడాది పాటు వీరంతా స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అయితే జీవీఎంసీ పాలకవర్గం పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 12తో ముగియనుంది.