నా చావుకి ఎవరు బాధ్యులు కారు. నేను చేసుకున్నదే. బెట్టింగ్ గేమ్స్‌కి బానిసనై, డబ్బులు చాలా వరకు పోగొట్టుకున్నాను. బెట్టింగ్ గేమ్స్‌కి బానిసను అవ్వటం వలన, ఎంత మానుకుందామన్నా, బెట్టింగ్ గేమ్స్ ఆడకుండా ఉండలేకపోతున్నా. నేను బతికి ఉన్నా కూడా నా ఫ్యామిలీకి ఎలాంటి యూజ్ లేదు అంటూ సూసైడ్ నోట్ రాసి జీవితాన్ని ముగించాడు నరేష్ అనే యువకుడు.
రూ.15లక్షలు అప్పు చేసిన నరేష్
సూసైడ్ నోట్ రాసింది నరేష్. వయసు 38ఏళ్లు. హైదరాబాద్ ఆటోనగర్‌లోని పోస్టల్ డిస్పాచ్ సెక్షన్‌లో పనిచేస్తున్నాడు. ప్రాపర్ విజయనగరంజిల్లా బొబ్బిలి. ప్రస్తుతం భార్య కీర్తి, బిడ్డ భవ్యతో వనస్థలిపురం సహారా గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాడు. ఉద్యోగానికి వెళ్లడం.. ఇంటికి రాగానే మొబైల్‌లో గేమ్స్ ఆడేవాడు. చాలారోజులుగా ఇలాగే చేశాడు. ఓ రకంగా చెప్పాలంటే నరేష్.. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌కి అడిక్ట్ అయ్యాడు. అందులోంచి బయటపడలేక ఆర్థికంగా నష్టపోయాడు. దాదాపు 15లక్షల దాకా అప్పులు చేసి గేమ్స్ ఆడి పోగొట్టుకున్నాడు. అప్పు తీర్చే మార్గం లేక.. గేమ్స్ ఆడకుండా ఉండలేక.. ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆన్‌లైన్ గేమ్స్‌ని బ్యాన్ చేయాలని రిక్వెస్ట్
సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకుని డెడ్‌బాడీని పరిశీలించారు. పక్కనే ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్‌ని బ్యాన్ చేయాలంటూ మోదీకి రిక్వెస్ట్ చేశాడు నరేష్. తప్పు తెలుసుకున్నాడు. కానీ అందులోంచి బయటపడలేకపోయాడు. భార్య బిడ్డ తనపై ఆధారపడ్డ విషయాన్ని మరచి సూసైడ్ చేసుకున్నాడు. ఒక్క నరేష్ మాత్రమే కాదూ.. చాలామంది యువకులు ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌కి అలవాటుపడి ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి.
ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం వెబ్‌సైట్‌లు, యాప్‌లు
ఆన్‌లైన్ బెట్టింగ్ అనేది ఇంటర్నెట్ ద్వారా జూదం ఆడటం. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ లేదంటే ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసిన ఇతర పరికరాలను ఉపయోగించి పందెం వేస్తారు. ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌లు, మొబైల్ యాప్‌లు ఉంటాయి. వీటిని విదేశీ సర్వర్ల నుంచి నిర్వహిస్తుంటారు. వాళ్లు ముందుగా పదో వందో వచ్చేలా చేస్తారు. ఆ తర్వాత వసూళ్లకి తెగబడతారు. ఇది తెలియక చాలామంది అప్పుల్లో కూరుకుపోతున్నారు. గేమింగ్ యాప్స్ బారినపడకుండా పిల్లల్ని కాపాడుకోవాలని తల్లిదండ్రులకు పోలీసులు సజెస్ట్ చేస్తున్నారు.