కాలేజీలో జరిగే ఓ కార్యక్రమానికి కొత్త చీర కొనివ్వలేదనే మనస్తాపంతో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన.. ధర్మవరం పట్టణంలో జరిగింది. బాలాజీనగర్‌లో నివసిస్తున్న గట్టు భాగ్యలక్ష్మి, గట్టు శ్రీరాములుకు ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు. పెద్ద కూతురు గౌతమి ధర్మవరం రైల్వేస్టేషన్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఇక చిన్న కూతురు గట్టు ఉషారాణి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతోంది. అయితే, కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు కొత్త చీర కొనివ్వాలని చిన్న కూతురు ఉషారాణి సోమవారం రాత్రి తల్లి భాగ్యలక్ష్మిని అడిగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి కూడా నువ్వు కొత్త చీర ఎలా అడుగుతావంటూ తల్లి ఆమెను మందలించింది. ఈ మాటలు విన్న ఉషారాణి ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్లి పడుకుంది. అయితే, మంగళవారం ఉదయం శ్రీరాములు బయటకు వెళ్లగా.. తల్లి భాగ్యలక్ష్మి పెద్దకూతురు గౌతమిని రైల్వేస్టేషన్‌లో వదిలిపెట్టేందుకు వెళ్లింది. తిరిగి వచ్చి చూసే సరికి చిన్నకూతురు తలుపులు వేసుకుని లోపల ఉండిపోయింది. తల్లి ఎంత పిలిచినా పలకక పోవడంతో చుట్టు పక్కలవారిని పిలిచి తలుపులు పగలకొట్టించింది. లోపలకు వెళ్లి చూడగా ఉషారాణి చీరతో ఉరివేసుకుని నిర్జీవంగా కనిపించింది. వెంటనే ఉషారాణిని కిందకు దించి అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా… డాక్టర్లు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.