హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లోని సయ్యద్ అలీగూడ ప్రాంతమది. ఓ బర్త్ డే వేడుకలో యువకులు హంగామా సృష్టించారు. పుట్టినరోజు వేడుక ఎవ్వరికైనా స్పెషలే. దాని కోసం ఎంతైనా ఖర్చు పెట్టి.. ఫ్రెండ్స్‌ని పిలిచి గుర్తుండిపోయేలా వేడుక గ్రాండ్‌గా చేసుకుని ఆనందపడాలని చాలామందికి ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరిగి ఉండొచ్చు. కానీ ఇలా కత్తుల కోలాటం ఏంటి? బ్యాట్లు పట్టుకుని వీరంగమేంటి? కుర్రకారు ఎంజాయ్ చేస్తుంది సరే.. ఇరుగుపొరుగు సంగతేంటి? వాళ్లకు అసలు నిద్రపడుతుందా? పక్కింట్లో వృద్దులుంటే.. వాళ్లు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడితే.. వాళ్ల పరిస్థితేంటి? బర్త్ డే పార్టీ అయినా.. పెళ్లి అయినా.. ఈ మధ్యకాలంలో ఇలాంటి సీన్లు చాలా కామన్‌గా మారాయనే టాక్ వినిపిస్తోంది.
వేడుకల రూపు రేఖలు మారిపోయాయి. హంగు ఆర్భాటాలు ఎక్కువైపోయాయి. రోడ్లపై బరాత్‌లు చేస్తున్నారు. వేడుకలు నిర్వహించుకుంటున్నారు. అయితే మారణాయుధాలు చేతపట్టుకుని డాన్స్‌లు చేయడమే ఆందోళనకు గురిచేస్తోంది. పెద్ద పెద్ద డీజేలు పెట్టి చెవులు చిల్లులు పడేలా సౌండ్‌లు పెట్టి రోడ్డు పక్కనే డాన్స్‌లు చేస్తూ హంగామా సృష్టిస్తున్నారు. వీటితో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు స్థానికులు. పైగా ఇలాంటి కార్యక్రమాల్లో యువత పాల్గొని మద్యం, గంజాయి తీసుకుని విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి చర్యలతో ఇళ్లల్లో కుటుంబంతో కలిసి సరిగా నిద్ర పోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు దృష్టి సారించారు. మహ్మద్ ఫజల్ బర్త్ డే వేడుకగా గుర్తించి.. పబ్లిక్ న్యూసెన్స్, సౌండ్ పొల్యూషన్, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని.. కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.