ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న హండ్రెడ్ టోర్నమెంట్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ తరపున బరిలోకి దిగాడు. ఈ ఎడిషన్ మొదటి మ్యాచ్‌లో, ఓవల్ ఇన్విన్సిబుల్స్ టీమ్.. లండన్ స్పిరిట్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టిన రషీద్ టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు.
ఈ మ్యాచ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టు తరపున బౌలింగ్ చేసిన రషీద్ ఖాన్ 20 బంతుల్లో మూడు ముఖ్యమైన వికెట్లు పడగొట్టి 11 పరుగులు ఇచ్చాడు. రషీద్ తీసిన మూడు వికెట్లలో వేన్ మాడ్సెన్, లియామ్ డాసన్, ర్యాన్ హిగ్గిన్స్ ఉన్నారు.
లియామ్ డాసన్‌ను రెండవ వికెట్‌గా తీసుకున్న రషీద్ ఖాన్ టీ20 క్రికెట్‌లో తన 650వ వికెట్‌ను పూర్తి చేసుకున్నాడు. దీంతో రషీద్ ఖాన్ ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే మొదటి బౌలర్ అయ్యాడు. ఇప్పటివరకు టీ20 క్రికెట్‌లో 478 ఇన్నింగ్స్‌లు ఆడిన రషీద్, 18.54 సగటుతో 651 వికెట్లు పడగొట్టాడు. అతను నాలుగుసార్లు 5 వికెట్లు కూడా పడగొట్టాడు.
రషీద్ ఖాన్ బౌలింగ్ వల్ల, ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టు లండన్ స్పిరిట్‌తో జరిగిన ది హండ్రెడ్ 2025 టోర్నమెంట్‌లోని మొదటి మ్యాచ్‌ను ఆరు వికెట్ల తేడాతో గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్ ఈ మ్యాచ్‌లో 80 పరుగులకే ఆలౌట్ అయింది. రషీద్ ఖాన్ కాకుండా, సామ్ కుర్రాన్ మూడు వికెట్లు పడగొట్టగా, జోర్డాన్ క్లార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు.
రషీద్ ఖాన్ అంతర్జాతీయ కెరీర్ గురించి చెప్పాలంటే, అతను ఆఫ్ఘనిస్తాన్ తరపున 96 టీ20 మ్యాచ్‌లు ఆడి, 13.80 సగటుతో 161 వికెట్లు పడగొట్టాడు. అతను 114 వన్డేల్లో 20.40 సగటుతో 199 వికెట్లు కూడా పడగొట్టాడు. రషీద్ ఆరు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 20.44 సగటుతో 45 వికెట్లు పడగొట్టాడు.