AP Districts Name Change: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించింది. జిల్లాల సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు కేబినెట్‌లో కూడా చర్చించారు.. అయితే నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటు అంశంతో పాటుగా జిల్లా ప్రధాన కేంద్రాలను మార్చాలంటూ ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
హైలైట్:
- ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు, పేర్లు మార్పు
- కేబినెట్‌లో చర్చించిన సీఎం చంద్రబాబు
- నెలలో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు

ఏపీలో పలు కొత్త జిల్లాల ఏర్పాటు, పేర్లు మార్పు, జిల్లాలు, మండలాలకు సంబంధించిన డిమాండ్‌లు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతాన్ని మార్కాపురం కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ గత ఐదేళ్లుగా వినిపిస్తోంది. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. యర్రగొండపాలెం, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాలు కలిపి జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఈ అంశం కూడా ప్రస్తుతం తెరపైకి వచ్చింది
అన్నమయ్య జిల్లాకు సంబంధించి రాయచోటి కాకుండా రాజంపేట ప్రధాన కేంద్రంగా ఉండాలనే డిమాండ్ వినిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు నర్సాపురాన్ని ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.. కానీ భీమవరాన్ని పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కేంద్రంగా ప్రకటించారు. ఇటు శ్రీసత్యసాయి జిల్లాకు సంబంధించి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలు అడుగుతున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. ప్రస్తుతం శ్రీసత్యసాయి జిల్లా ప్రధాన కేంద్రంగా పుట్టపర్తి ఉంది.
జగన్ మందలించాల్సిందిపోయి ఇలా చేస్తే ఎలా.. చంద్రబాబు
కొత్త 26 జిల్లాల్లో ఒక గిరిజన జిల్లా ఉంటుందని చెప్పిన గత ప్రభుత్వం.. రెండు జిల్లాలను ప్రకటించింది. పాడేరు ప్రధాన కేంద్రం అల్లూరి సీతారామరాజు.. పార్వతీపురం ప్రధాన కేంద్రంగా మన్యం జిల్లా ఏర్పాటైంది. అయితే మన్యం జిల్లా పేరు మార్చాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. రెవెన్యూ డివిజన్ల విభజనపై కూడా వినతులు వస్తు్న్నాయి. వీటితో పాటుగా పలు రెవెన్యూ డివిజన్లు, మండలాల అంశాలు కూడా తెరపైకి వచ్చాయి.. వాటిని సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు.