India squad for Asia Cup 2025: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఎంపికలో సెలెక్టర్లకు కఠిప సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఓపెనింగ్, మిడిల్ ఆర్డర్‌లో యువ ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. శుభమాన్ గిల్, యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వంటి ఆటగాళ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని జట్టులోకి తీసుకోవాలి. ఎవరిని పక్కన పెట్టాలనేది సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది.
యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్ ఇద్దరూ గత కొంతకాలంగా భారత టెస్ట్, వన్డే జట్లలో నిలకడగా రాణిస్తున్నారు. అయితే, టీ20 ఫార్మాట్‌లో వీరికి అంతగా అవకాశాలు లభించలేదు. తాజాగా, ఆసియా కప్‌లో వీరు తిరిగి టీ20 జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. వీరిద్దరూ అగ్రశ్రేణి ఓపెనర్లు. కానీ, ఐపీఎల్ 2025లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన అభిషేక్ శర్మ కూడా జట్టులో చోటు కోసం పోటీ పడుతున్నాడు. ఇతడు దూకుడుగా ఆడుతూ మంచి స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. ముగ్గురు అగ్రశ్రేణి ఓపెనర్లు అందుబాటులో ఉండగా, జట్టు కూర్పు ఎలా ఉండాలనేది సెలెక్టర్లకు కత్తి మీద సాము వంటిది.
సంజు శాంసన్ పేరు కూడా ఈ చర్చలో ప్రధానంగా వినిపిస్తోంది. అతను వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా జట్టుకు కీలకం కాగలడు. అయితే, సంజుకు మిడిల్ ఆర్డర్‌లో స్థానం దొరకడం కష్టంగా మారింది. గత టీ20 ప్రపంచ కప్‌లో అతను పెద్దగా రాణించలేకపోయాడు. ఈ కారణంగా అతనికి ఓపెనింగ్‌లో అవకాశాలు తగ్గించారు. ఐపీఎల్ 2025లో గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైనప్పటికీ, అతని బ్యాటింగ్ నైపుణ్యంపై సెలెక్టర్లకు మంచి అభిప్రాయమే ఉంది. కానీ, ఇప్పటికే వికెట్ కీపర్ల స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్ వంటివారు రేసులో ఉన్నారు. దీంతో సంజు శాంసన్‌కు జట్టులో చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి
ఈ ఆసియా కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లు ఉండకపోవచ్చు. సూర్యకుమార్ యాదవ్ జట్టుకు నాయకత్వం వహించవచ్చు. అయితే అతడి ఫిట్‌నెస్ కూడా సందేహంలో ఉంది. ఈ పరిస్థితుల్లో యువ ఆటగాళ్లకు అవకాశం లభించనుంది. ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సాయి సుదర్శన్ పేరు కూడా జట్టు ఎంపికలో ప్రముఖంగా వినిపిస్తోంది. బౌలింగ్ విభాగంలో, జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా ఆసియా కప్‌నకు దూరంగా ఉండవచ్చని సమాచారం.
మొత్తంగా, ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఎంపిక యువ ఆటగాళ్ల మధ్య గట్టి పోటీని సృష్టిస్తోంది. సెలెక్టర్లు అనుభవం, ఫామ్, జట్టు సమతూకం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సరైన నిర్ణయం తీసుకోవాలి. జట్టు ఎంపిక ప్రకటన వెలువడే వరకు అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగడం ఖాయం.
ఐపీఎల్ 2025 యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్ లకు చాలా చిరస్మరణీయమైనది. యశస్వి జైస్వాల్ 559 పరుగులు, శుభ్మాన్ గిల్ 650 పరుగులు సాధించారు. అదే సమయంలో, అభిషేక్ శర్మ కూడా 439 పరుగులు చేశాడు. అయితే, సంజు సామ్సన్ గాయం కారణంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అతను 9 మ్యాచ్‌ల్లో 285 పరుగులు చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..