National Handloom Day: ఏపీలో ఉన్న చేనేత కార్మికులకు సీఎం చంద్రబాబు శుభవార్త అందించారు. ఈనెల నుంచే వారందరికీ 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని చేనేతలను ప్రోత్సహించి.. వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని తేల్చి చెప్పారు. ఇక అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చేనేత వైభవానికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ నెల నుంచే చేనేత మగ్గాలు ఉన్నవారికి నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటును సరఫరా చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఒకవేళ పవర్ లూమ్ ఉన్నవారికి నెలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా చేనేత కార్మికులకు జీఎస్టీలో 5 శాతాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 50 ఏళ్లు దాటిన చేనేత కార్మికులకు నెల నెలా పెన్షన్లు అందిస్తామని చంద్రబాబు తెలిపారు. వీటన్నింటితోపాటు రాజధాని అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా చేనేత వైభవానికి పుట్టినిల్లు తెలుగు నేల అని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేనేత ఒక సంపద అని చంద్రబాబు కొనియాడారు. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు ఖద్దరును మహాత్మాగాంధీ మెచ్చుకున్నారని గుర్తు చేశారు. హరప్పా కాలం నుంచి చేనేత అభివృద్ధి చెందుతూ వస్తోందని.. నాగరికతకు మూలం నేతన్ననే అంటూ ప్రశంసలు కురిపించారు. కాకతీయులు పాలించిన కాలంలో.. నాణేలపైన చేనేతల ముద్రలు కనిపిస్తాయని పేర్కొన్నారు.
వ్యాపారం కోసం భారత్‌కు వచ్చిన బ్రిటిష్ వారు.. మన దేశంలోని చేనేతలపై ప్రభావం చూపారని తెలిపారు. అందుకే స్వాతంత్య్ర పోరాటంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని.. మన దేశంలో నేసిన బట్టలను మాత్రమే ఉపయోగించాలని గాంధీజీ చెప్పారని చెప్పారు. తెలుగుదేశం పార్టీతో చేనేతలకు అవినాభావ సంబంధం ఉందన్న చంద్రబాబు.. వారికి మొట్టమొదట ఉపాధి కల్పించింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో చేనేతల కోసం రాజీ లేని పోరాటం చేసినట్లు చంద్రబాబు చెప్పారు.
మన దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించే రంగం వస్త్ర పరిశ్రమ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 55,500 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.27 కోట్ల రుణాలు ఇచ్చినట్లు చంద్రబాబు వెల్లడించారు. మొత్తం 90,765 కుటుంబాలకు 100 యూనిట్లు ఉచిత కరెంటును సరఫరా చేసినట్లు తెలిపారు. చేనేత కార్మికులు చిన్న వయసులోనే అనారోగ్యం పాలవుతుండటంతో వారికి 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. 50 శాతం సబ్సిడీతో మర మగ్గాలు ఇచ్చేందుకు రూ.80 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.