Guntur Illegal structures demolition: గుంటూరులో అక్రమ కట్టడాల మీద అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అలాంటి వాటికి నోటీసులు జారీ చేసి కూల్చివేతలు చేపడుతోంది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. గత మూడురోజులుగా ఈ స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది. ఇందుకోసం టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటుచేశారు. శుక్రవారం నుంచి అనధికారిక లేఅవుట్ల తొలగింపు కూడా చేపట్టనున్నట్లు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు.

జీఎంసీ అధికారులు ఇప్పటికే ఇలాంటి నిర్మాణాలను చాలా వాటిని గుర్తించి వాటి యజమానులకు నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలు, భవన నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు తేలితే అలాంటి వాటిని కూల్చివేస్తామని గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. గత మూడు రోజులుగా పలు కాలనీలలో ఇలా చేపట్టిన నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు కూల్చివేసినట్లు తెలిపారు. అలాంటి నిర్మాణాలను ఎలాంటి జాప్యం లేకుండా కూల్చివేయాలని సూచించినట్లు తెలిపారు. భవానీ నగర్, శ్రీరామనగర్ ఏడో లైన్, బొంగరాల బీడు, అరండల్ పేట్ వంటి ప్రాంతాలలో ఇప్పటికే భవనాల కూల్చివేతను మొదలుపెట్టినట్లు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు.
వీటితో పాటుగా మరో 25 అనధికారిక భవనాలను గుర్తించామని..వాటికి తుది నోటీసులు జారీ చేసినట్లు జీఎంసీ కమిషనర్ వివరించారు. శుక్రవారం నుంచి అనధికారిక లేఅవుట్లను తొలగించే కార్యక్రమం మొదలుపెట్టనున్నట్లు వివరించారు. అలాగే జీఎంసీ అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగులను తొలగించాలని అధికారులను ఆదేశించారు. జీఎంసీకి నిర్దేశిత మొత్తంలో ఫీజు చెల్లించని హోర్డింగులను కూడా తొలగించాలని ఆదేశించారు. వార్డు ప్లానింగ్ అధికారులు వారికి సంబంధించిన ప్రాంతాలలో పర్యటించి.. అక్రమ నిర్మాణాలను గుర్తించాలని.. వాటికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అలాగే ఫీజు చెల్లించని హోర్డింగులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్ల మీద భవన నిర్మాణాల మెటీరియల్ ఉంచిన వారికి పెనాల్టీ విధించాలని స్పష్టం చేశారు.