APERC Voluntary Additional Load Scheme Offer: గృహ విద్యుత్ వినియోగదారులకు ఏపీఈఆర్‌సీ మంచి అవకాశం కల్పిస్తోంది. అదనపు విద్యుత్ క్రమబద్ధీకరణ గడువు జూన్ 30తో ముగియగా.. తాజాగా దానిని డిసెంబర్ 31వ తేదీ వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సరైన ప్రచారం లేక ఎక్కువ మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారనే కారణంతో స్వచ్ఛందంగా అదనపు లోడ్ క్రమబద్ధీకరణ కోసం డిసెంబర్ 31వ తేదీ వరకూ ఛాన్స్ ఇచ్చింది. ఆలోపు చేసుకుంటే 50 శాతం వరకూ రాయితీ అందించనుంది.

ఏంటీ అదనపు లోడ్..
సాధారణంగా మనందరం ఇళ్లల్లో కరెంట్ బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు, టీవీలు, కూలర్లు, ఫ్రిజ్‌లు వంటివి ఉపయోగిస్తూ ఉంటాం. దీంతో ఇళ్లల్లో కరెంట్ వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో విద్యుత్ కనెక్షన్ కోసం అప్లై చేసుకున్న సమయంలో నమోదు చేసిన కరెంట్ లోడ్ కంటే ఈ మొత్తం దాటిపోతోంది. దీంతో ఈ అదనపు భారం రెగ్యులేటరీల మీద పడుతోంది. దీంతో విద్యుత్ సరఫరాలో సమస్యలు, లోఓల్టేజ్ ఇష్యూలు వస్తున్నాయి. దీంతో అదనపు లోడ్ క్రమబద్ధీకరణకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. అయితే సాధారణంగా గృహ విద్యుత్ వినియోగానికి సంబంధించి.. అదనపు లోడ్ కిలోవాట్‌కు డెవలప్‌మెంట్ ఛార్జీ కింద రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సెక్యూరిటీ డిపాజిట్‌గా రెండు వందల రూపాయలు.. దీనికి తోడు దరఖాస్తుకు రూ.50 కలిపి మొత్తంగా రూ.2,500 వరకూ వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. అదనపు ఖర్చుల కింద మరో రూ.250 అధికం. అయితే అదే ఇప్పుడు ఉన్న పథకం ప్రకారం స్వచ్ఛందంగా విద్యుత్ అదనపు లోడ్ క్రమబద్ధీకరించుకునే వారు రూ.1,250 చెల్లిస్తే చాలు. అదనపు లోడ్ క్రమబద్ధీకరణకు తొలుత జూన్ 30 వరకూ సమయం ఇచ్చారు. ఆ గడువు ముగిసిపోగా.. తాజాగా ఈ గడువును డిసెంబర్ 31 వరకూ పొడగించారు.