Andhra Pradesh Temples Roof Repairs,ఏపీలోని ప్రముఖ ఆలయాల పైకప్పుల మరమ్మతులు.. సిమెంట్ వాడరు, ఎలా చేస్తారంటే – iconic temples roof repairs with ancient methods in andhra pradesh
AP Temples Roof Repairs: ఆంధ్రప్రదేశ్‌లోని పురాతన దేవాలయాల పైకప్పులు, ఇతర నిర్మాణాల మరమ్మత్తులకు సరికొత్త విధానం అమలవుతోంది. సిమెంట్, కాంక్రీటు వాడకం వల్ల ఆలయాల నాణ్యత దెబ్బతినకుండా, పూర్వకాలపు పద్ధతుల్లో మరమ్మతులు చేస్తున్నారు. సున్నం, బెల్లం, కరక్కాయలు కలిపి తయారుచేసిన జిగురుతో పనులు చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర ఛారిటబుల్ ట్రస్ట్ ఈ పునరుద్ధరణ పనులను ఉచితంగా చేస్తోంది. ఇంతకీ ఈ ట్రస్ట్ చేస్తున్న పనులేమిటి? ఏయే ఆలయాల్లో ఈ పనులు జరుగుతున్నాయంటే..
హైలైట్:
ఏపీలో ఆలయాలకు మహర్దశ
పైకప్పుల మరమ్మతుల పనులు
పురాతన పద్దతుల్లో మరమ్మతులు
ఏపీ పాత పద్ధతిలో ఆలయాలకు మరమ్మతులు (ఫోటోలు– Samayam Telugu)
ఏపీలో ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి.. దేవుళ్ల దర్శనానికి నిత్యం లక్షలాదిమంది భక్తులు వస్తుంటారు. అయితే కొన్ని ప్రాచీన ఆలయాల పైకప్పు, ఇతర నిర్మాణాలు మరమ్మతులు విషయంలో జాగ్రత్తలు అవసరం. భారతీయ పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) పరిధిలోని ఆలయాలను వారే చూసుకుంటారు. కానీ, మిగిలిన వాటిని వేరే సంస్థలు చూస్తాయి. వారికి సరైన అవగాహన లేకపోవడంతో సిమెంట్, కాంక్రీటుతో మరమ్మతులు చేస్తున్నారు. దీనివల్ల ఆలయాల నాణ్యత దెబ్బతింటోంది. అందుకే పురాతన పద్ధతిలో మరమ్మతులు పనులు చేపట్టారు.పూర్వం ఆలయాలు, కట్టడాలు కట్టడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి వాడేవారు. సున్నం, బెల్లం, కరక్కాయలు లాంటి వాటితో ఒక జిగురు తయారుచేసి, దానితో పైకప్పులు కట్టేవారు. ఇలా కట్టిన కట్టడాలు చాలాకాలం చెక్కుచెదరకుండా ఉండేవి. చోళులు, పల్లవులు, కాకతీయులు, విజయనగర రాజులు ఈ పద్ధతినే వాడారు. సున్నం, బెల్లం, కరక్కాయలు, బెండకాయలు, ఒక రకమైన చెట్టు జిగురు, జనపనార, మినపపప్పు కలిపి 20 రోజులు నానబెడతారు. అప్పుడు ఆ మిశ్రమం చిక్కటి జిగురులా మారుతుంది. ఆలయాల పైకప్పులకు ఈ జిగురును పూసి, బంగాళా పెంకులు అతికిస్తారు.. దీనివల్ల నీళ్లు లోపలికి వచ్చే అవకాశం ఉండదు.ఇలా చేస్తే దాదాపు 200 ఏళ్ల వరకు కట్టడాలు సేఫ్‌గా ఉంటాయట.
ఈ మేరకు ఈ పనుల్ని శ్రీ వెంకటేశ్వర ఛారిటబుల్, రిలిజియస్ ట్రస్ట్ ఉచితంగా చేస్తోంది. ఈ ట్రస్ట్ ఛైర్మన్ పి. వెంకటేశ్వరరావు తెలుగు వ్యక్తి.. అందుకే రాష్ట్రంలోని దేవాలయాలకు సొంత డబ్బుతో మరమ్మతులు చేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాళహస్తి ఆలయం పైకప్పు పనులు రూ.6 కోట్లతో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తి చేశారు. రూ.4 కోట్ల వ్యయంతో సింహాచలం ఆలయం పైకప్పు పనులు 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ముగింపు దశకు వచ్చాయి. తాజాగా శ్రీశైలంలో పైకప్పు, స్తంభాలు 24 వేల చదరపు అడుగుల్లో మరమ్మతు పనులు మొదలు పెట్టారు. రూ.3 కోట్లతో తిరుపతిలో అలిపిరి పాదాల మండపం మరమ్మతుల పనులు చేపట్టనున్నారు.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి