Gautam Gambhir : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ చివరి రోజున తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విజయం కోసం భారత్‌కు నాలుగు వికెట్లు కావాలి, ఇంగ్లాండ్‌కు కేవలం 35 పరుగులు అవసరం. ఈ కీలక సమయంలో ఐసీసీ మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో భారత్‌కు ఒక తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. స్లో ఓవర్-రేట్ కారణంగా భారత్‌కు నాలుగు WTC (ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్) పాయింట్లను తగ్గించవచ్చని హెచ్చరించారు. ఈ క్లిష్ట పరిస్థితిలో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న ఒక ధైర్యమైన నిర్ణయం జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించింది.
ఐదో టెస్ట్ మ్యాచ్ చివరి రోజున ఆట ప్రారంభం కాకముందే, మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో టీమిండియా మేనేజ్‌మెంట్‌ను పిలిచి హెచ్చరించారు. భారత జట్టు ఓవర్-రేట్ ఆరు ఓవర్లు వెనుకబడి ఉందని, దీనికి గాను నాలుగు WTC పాయింట్లను తగ్గించవచ్చని తెలిపారు. ఈ హెచ్చరికతో టీమ్ మేనేజ్‌మెంట్ ఆందోళనలో పడింది. అప్పుడు టీమ్ కోచ్ గౌతమ్ గంభీర్, అసిస్టెంట్ కోచ్ సిటాంషు కొటాక్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒకరితో ఒకరు చర్చించుకున్నారు.
టీమ్ మీటింగ్‌లో ఒక సభ్యుడు ఓవర్-రేట్‌ను పెంచడానికి ఇరు వైపుల నుంచి స్పిన్నర్లతో బౌలింగ్ చేయమని సూచించారు. అలా అయితే తక్కువ సమయంలో ఓవర్ పూర్తవుతుంది.. ఐసీసీ పెనాల్టీ నుంచి తప్పించుకోవచ్చు అని సలహా ఇచ్చారు. కానీ, కోచ్ గౌతమ్ గంభీర్ అందుకు అంగీకరించలేదు. “మనం పాయింట్ల గురించి ఆలోచించొద్దు, కేవలం గెలుపుపైనే దృష్టి పెట్టాలి” అని గట్టిగా చెప్పినట్లు దైనిక్ జాగరణ్ పత్రిక ఒక నివేదికలో పేర్కొంది. గంభీర్ నిర్ణయానికి మేనేజ్‌మెంట్ సపోర్టు తెలిపింది.
గౌతమ్ గంభీర్ నిర్ణయం ప్రకారం.. చివరి రోజున పేసర్లు ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ మాత్రమే బౌలింగ్ చేశారు. ఈ ఇద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేసి గంటలోపే ఇంగ్లాండ్ మిగిలిన నాలుగు వికెట్లను పడగొట్టారు. భారత్ ఆ మ్యాచ్‌ను ఆరు పరుగుల తేడాతో గెలుచుకుంది. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా భారత్‌కు లభించిన అతి తక్కువ తేడాతో గెలిచిన విజయం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ప్లేయర్స్ లేకుండానే ఈ విజయం సాధించడం, గంభీర్ నిర్ణయానికి ఎంత బలం ఉందో తెలియజేస్తుంది. ఈ విజయం తర్వాత భారత్‌కు ఎలాంటి పెనాల్టీ కూడా పడలేదు. ప్రస్తుతం భారత్ WTC పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, శ్రీలంక తర్వాత మూడో స్థానంలో ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….