న్యూయార్క్ నడిబొడ్డున ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రమైన టైమ్స్ స్క్వేర్ హింసకు సాక్ష్యంగా నిలిచింది. ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా.. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. ఆగస్టు 9, శనివారం (అమెరికా సమయం) తెల్లవారుజామున టైమ్స్ స్క్వేర్‌లో కాల్పుల సంఘటన గందరగోళానికి దారితీసింది.
వెస్ట్ 44వ స్ట్రీట్.. 7వ అవెన్యూ మధ్య కూడలిలో శనివారం తెల్లవారుజామున 1:20 గంటలకు కాల్పులు జరిగాయని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ధృవీకరించింది. ముగ్గురు బాధితులు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఒక ప్రత్యక్ష సాక్షి సోషల్ మీడియాలో కాల్పుల ఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. న్యూయార్క్ పోలీసుల సమాచారం ప్రకారం, ఒక వివాదం అనంతరం 17 ఏళ్ల యువకుడు టైమ్స్ స్క్వేర్‌లో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడు, 65 ఏళ్ల వ్యక్తి గాయపడ్డారు. రద్దీగా ఉండే ఈ పర్యాటక ప్రాంతంలో కాల్పులు జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
జూన్‌లో యుఎస్ సుప్రీంకోర్టు తుపాకీ హక్కులను విస్తరించిన తర్వాత వచ్చిన విస్తృత రాష్ట్ర చట్టం ప్రకారం ఇలాంటి సున్నితమైన ప్రదేశాలలో తుపాకుల నిషేధం విధించారు. టైమ్స్ స్క్వేర్‌ను తుపాకీ రహిత జోన్‌గా మార్చారు. కాగా, తాజా ఘటనతో ప్రముఖ పర్యాటక ప్రాంతం టైమ్స్ స్క్వేర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..