దేశ వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాఖీ పౌర్ణమి పండుగ సోదర-సోదరీమణుల అనుబంధాన్ని మరింత బలపరిచే వేడుకలతో తెలంగాణలో ఉత్సాహంగా కొనసాగుతోంది. రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క.. పలువురు ప్రముఖ నేతలకు రాఖీలు కట్టి వారి పట్ల.. తన ఆప్యాయతను చాటుకున్నారు. మంత్రుల నివాస సముదాయంలో ఆమె సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాఖీ కట్టి.. పరస్పరం స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. సీతక్క తన సొంత సోదరి లాంటిదని చెప్పుకొచ్చారు. రాఖీ పండుగ అన్న-చెల్లెలు, అక్కా-తమ్ముళ్ల బంధాన్ని మరింత గాఢం చేస్తుందని, ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం… కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన జేబులోని నోట్ల కట్టను తీసి సీతక్కకు బహుమతిగా అందించారు. ఆమె వద్దని నిరాకరించినా… మంచి చీర కొనుక్కో అంటూ పట్టుబట్టి అందించడం అందర్నీ ఆకట్టుకుంది.
ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా సీతక్క రాఖీ కట్టారు. సీఎం నివాసంలో రాఖీ కట్టిన ఆమె.. ముఖ్యమంత్రితో పాటు ఆయన మనవడికీ రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఈ వేడుకలో సీఎం సతీమణి, కుమార్తెతో కలిసి పండుగ వాతావరణాన్ని పంచుకున్నారు. అదేవిధంగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కూడా రాఖీ కట్టారు సీతక్క. రాష్ట్రంలోని కీలక నేతలతో ఆప్యాయ బంధాన్ని పంచుకుంటూ, రాఖీ పండుగ ప్రేమ, రక్షణ, అనుబంధానికి ప్రతీక సీతక్క చాటిచెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.