జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రానికి చెందిన సరిత అనే మహిళ ప్రతి సంవత్సరం మాదిరి ఈ సారి కూడ తమ్ముడికి రాఖీ కట్టాలని భావించింది. ఈ నేపథ్యంలో తమ్ముడు నివసించే మానవపాడు గ్రామానికి బయలుదేరింది. మానవపాడుకు చేరుకోవాలంటే ప్రధాన మార్గంలోని రైల్వే అండర్ బ్రిడ్జిని దాటి వెళ్లాలి. అయితే గత రాత్రి కురిసిన భారీ వర్షానికి మానవపాడు పరిసర ప్రాంతాల్లోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీనికి తోడు రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిగా నీట మునిగింది.
దీంతో రెండువైపుల రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామానికి వెళ్లేందుకు దారి లేకుండా మారిపోయింది పరిస్థితి. ఇక పరిస్థితిని తెలుసుకొని ప్రమాదాలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో పోలీసులు అండర్ బ్రిడ్జి నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అయితే తమ్ముడికి రాఖీ కట్టేందుకు కోటి ఆశలతో వెళ్లిన సరితకు వరద నీరు అడ్డుగా మారాయి. దీంతో చేసేది లేక కాసేపు అక్కడ వేచి చూసింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన యువకులు కొంత మంది అండర్ బ్రిడ్జి వాల్ పైన నడుచుకుంటూ రైల్వే ట్రాక్ దాటి అటు వైపు వెళ్తున్నారు. దీన్ని గమనించిన సరిత తను కూడా అలా వెళ్దామని భావించింది.
కానీ 20 అడుగుల ఎత్తులో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి గోడపై ప్రమాదకరంగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే సోదర, సోదరిమణుల ప్రేమముందు అవేవి సరితకు అడ్డుగా అనిపించలేదు. మెల్లిగా వాల్ పైన నడుచుకుంటూ ఎట్టకేలకు ట్రాక్ దాటి అటు వైపు వెళ్లిపోయింది. అక్కడి నుంచి ఆటో ఎక్కి తమ్ముడి ఇంటికి వెళ్లింది. తమ్ముడికి రాఖీ కట్టి అక్క, తమ్ముడి అప్యాయతలు పంచుకున్నారు. ఇక రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద నీటిని చూసి తమ్ముడికి రాఖీ కట్టలేనేమో అనుకున్న సరితా… ప్రమాదాన్ని దాటుకుంటూ ఎట్టకేలకు రాఖీ కట్టానని ఆనందభాష్పాలు రాల్చింది.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.