
జపాన్‌ను చూసి చైనా భయపడుతోందా అంటే? దౌత్య నిపుణులు అవుననే అంటున్నారు. అదేంటీ.. చైనా చాలా పెద్ద దేశం, అభివృద్ధి చెందిన దేశం కదా.. అదేందుకు జపాన్ లాంటి చిన్న దేశాన్ని చూసి భయపడుతుందనే అనుమానం రావొచ్చు. అందుకు కారణం ఏంటంటే.. జపాన్ కొత్త వైమానిక శక్తి చైనాలో ఆందోళనను పెంచింది. వాస్తవానికి జపాన్ వైమానిక స్వీయ రక్షణ దళం (JASDF) మియాజాకి ప్రావిన్స్‌లోని న్యూతబారు ఎయిర్‌బేస్‌లో కొత్త F-35B స్టెల్త్ ఫైటర్ జెట్‌లను మోహరించింది. ఇది ప్రాంతీయ శాంతి, స్థిరత్వంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చైనా తెలిపింది. F-35B అనేది ఏదైనా రాడార్‌ను తప్పించుకోగల స్టెల్త్ టెక్నాలజీతో కూడిన మల్టీరోల్ ఫైటర్ జెట్.
జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ 2024లో న్యూతబారు వైమానిక స్థావరంలో F-35B ని మోహరించాలని ప్రణాళిక వేసింది. అయితే US ద్వారా డెలివరీ ఆలస్యం అయింది. JASDF ప్రకారం.. జపాన్ మొత్తం 42 F-35B లను కొనుగోలు చేస్తుంది. వీటిలో ఎనిమిది ఫైటర్ జెట్‌లు ఈ వైమానిక స్థావరంలో మోహరించబడతాయి. గురువారం మోహరించిన నాలుగు విమానాలలో మొదటి బ్యాచ్‌లో మూడు అమెరికన్ పైలట్ల నియంత్రణలో గువామ్ స్థావరానికి వెళ్లాయి.
జపాన్‌లో F-35B ఫైటర్ జెట్‌ల మోహరింపును చైనా శాంతికి ముప్పుగా అభివర్ణించింది. ఈ ఫైటర్ జెట్‌ల మోహరింపు జపాన్ వ్యూహం రక్షణ నుండి దాడికి మారడానికి సంకేతం అని ఒక సైనిక వ్యవహారాల నిపుణుడు చెప్పినట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఇది జపాన్ విస్తారమైన పసిఫిక్ ప్రాంతంలో, అంతకు మించి దాడి కార్యకలాపాలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఇది ప్రాంతీయ శాంతిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చైనా నుండి వచ్చే ముప్పు పేరుతో జపాన్ ఇదంతా చేస్తోందని చైనా సైనిక వ్యవహారాల నిపుణుడు జాంగ్ జున్షే అన్నారు.
F-35B చాలా ప్రత్యేకమైనది
F-35B అనేది అమెరికాలో తయారైన మల్టీ టాస్క్ యుద్ధ విమానం. దీనిని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఇది సంక్లిష్టమైన యుద్ధ వాతావరణంలో కూడా పనిచేయగల వేగవంతమైన ప్రక్రియ కలిగిన జెట్. దీని అత్యంత ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇది చాలా చిన్న రన్‌వే నుండి బయలుదేరి నిలువుగా ల్యాండ్ అవుతుంది. ఇప్పటివరకు జపాన్ వద్ద అలాంటి విమానం లేదు. అందుకే చైనా, జపాన్ విషయంలో ఆందోళన చెందుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి