ఎన్నికల సంఘం ఇటీవల బీహార్‌లో చేపట్టిన ఓట్ల తొలగింపు ప్రక్రియ సంచలనంగా మారింది. ఈసీ అన్యాయంగా ఓట్లను తొలగిస్తుందని విపక్షాలు ఆరోపనలు గుప్పించాయి. ఈసీ బీజేపీ అనుబంధ సంఘంగా పనిచేస్తుందని.. అక్రమాలకు పాల్పడుతుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనిపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరింది. నకిలీ ఓట్లను తొలగించడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఈసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 334 గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై నిషేధం విధించింది. పన్ను మినహాయింపు వంటి ప్రత్యేక హక్కులు, ప్రయోజనాలను పొందుతున్న ఈ పార్టీలు 2019 నుండి ఎన్నికల్లో పోటీ చేయాలనే తప్పనిసరి షరతును పాటించలేవు. దీంతో ఎన్నికల సంఘం రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుండి తొలగించింది.
ఈ పార్టీలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A నిబంధనల ప్రకారం ఈసీఐలో నమోదు చేసుకుంటాయి. ఈ నిబంధనల ప్రకారం.. సదరు రాజకీయ పార్టీ పన్ను మినహాయింపు వంటి కొన్ని ప్రత్యేక హక్కులు, ప్రయోజనాలను పొందుతుంది. అయితే కొన్ని పార్టీలు 2019 నుండి ఏ లోక్‌సభ లేదా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ లేదా ఉప ఎన్నికలలో పోటీ చేయలేవు. దీంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ఈసీ అటువంటి 334 పార్టీలను గుర్తించి జాబితా నుంచి తొలగించింది. రాజకీయ వ్యవస్థలో స్వచ్ఛతను తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ చర్య తీసుకున్నట్లు ఈసీ తెలిపింది.
షోకాజ్ నోటీసు జారీ..
ఈసీ ఉన్నపళంగా ఈ నిర్ణయం తీసుకోలేదు. గత కొన్నాళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలను గుర్తించి షోకాజ్ నోటీసు జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారులను సీఈసీ ఆదేశించింది. ఆ తర్వాత అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను తెలుసుకుంది. చివరకు గత ఆరేళ్లుగా 334 పార్టీలు ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదని తేల్చి.. జాబితా నుంచి తొలగించింది.
30 రోజుల్లోపు అప్పీల్..
ప్రస్తుతం దేశంలో 6 జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర పార్టీలు, 2854 గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఉన్నాయి. పార్టీలు తమ రిజిస్ట్రేషన్ సమయంలో పేరు, చిరునామా, ఆఫీస్ బేరర్లు మొదలైన వివరాలను అందించాలి. ఏదైనా మార్పులు ఉంటే ఎటువంటి ఆలస్యం లేకుండా కమిషన్‌కు తెలియజేయాలి. తొలగించబడిన గుర్తింపు లేని పార్టీలు RP చట్టంలోని సెక్షన్ 29B , సెక్షన్ 29C నిబంధనల ప్రకారం ఎటువంటి ప్రయోజనాలను పొందేందుకు అర్హులు కావు. అయితే కమిషన్ యొక్క ఈ నిర్ణయంపై వేటు పడిన పార్టీలు 30 రోజుల్లోపు అప్పీల్ చేసుకోవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..