అరటిపండు.. ఏడాది పొడవునా లభించే, చవకైన పోషకాలతో నిండిన పండు. కానీ చాలా మంది ప్రతిరోజూ అరటిపండ్లు తినడానికి సంకోచిస్తారు. ప్రతి రోజూ అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదా? కాదా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిజానికి.. అరటి పండ్లు మంచి శక్తి వనరు. అరటిపండ్లలో సహజ కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు (గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్) సమృద్ధిగా ఉంటాయి. ఇవి చాలా త్వరగా శక్తిని పెంచుతాయి. అందుకే.. అథ్లెట్లు, కష్టపడి పనిచేసేవారు, వ్యాయామానికి ముందు, తరువాత తక్షణ శక్తి కోసం అరటి పండ్లు తింటారు.
అరటిపండ్లలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వాటిలో ఉండే పెక్టిన్ జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తుంది. పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. అరటిపండ్లలో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అరటిపండ్లు ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లాన్ని అందిస్తాయి. ఇది సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. మంచి మానసిక స్థితిని కాపాడుకోవడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సెరోటోనిన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
పొటాషియం, మెగ్నీషియం కండరాలను బలంగా ఉంచడంలో, తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడతాయి. అవి కాల్షియం శోషణను కూడా పెంచుతాయి. ఇది ఎముకలను బలపరుస్తుంది. అరటిపండ్లను అప్పుడప్పుడు అంటే మితంగా తినడం వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. ఎందుకంటే పొటాషియం మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ వీటిని అధికంగా తినకూడదు. ముఖ్యంగా ఓ మధ్య తరహా అరటిపండులో దాదాపు 100 నుంచి 120 కేలరీలు ఉంటాయి. ప్రతిరోజూ ఎక్కువ అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరగవచ్చు. అరటిపండ్లు మితమైన గ్లైసెమిక్ సూచికను కలిగి ఉన్నప్పటికీ, ఎక్కువగా తినడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
అరటిపండ్లు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో పొటాషియం స్థాయిలు పెరుగుతాయి. ఇది మూత్రపిండాల సమస్యలు, గుండె క్రమరాహిత్యాలకు కారణమవుతుంది. కానీ ఇది చాలా అరుదు. అయితే అరటి పండ్లు మూత్రపిండ రోగులకు ప్రమాదం. అరటిపండ్లలో ఉండే టైరమైన్ అనే సమ్మేళనం మైగ్రేన్‌లను ప్రేరేపిస్తుంది. కొంతమందికి అరటిపండ్లు అలెర్జీగా ఉంటాయి. ఆరోగ్యకరమైన వారు రోజుకు 1–2 అరటిపండ్లు తినడం సురక్షితం. మధుమేహ వ్యాధిగ్రస్తులు డాక్టర్ సలహా మేరకు మాత్రమే అరటి పండ్లు తినాలి. ఒకవేళ ఎవరికైనా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉంటే, పొటాషియంను నియంత్రించడానికి అరటిపండ్లు తినకపోవడమే మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.