ప్రపంచ ప్రఖ్యాత అరకు కాఫీకి మరింత ఇమేజ్ తీసుకొచ్చేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కాఫీ ఘుమఘుమలను అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరికీ చేరువ చేయడమే కాకుండా.. ఆదివాసీల ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కల్పించే దిశగా పలు ప్రతిష్ఠాత్మక సంస్థలతో ఎంఓయూలు చేసుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో శనివారం ఈ అవగాహన ఒప్పందాలు జరిగాయి. గిరిజన , అటవీ ఉత్పత్తుల విక్రయానికి ఈ అవగాహన ఒప్పందాలు సహకరిస్తాయి.
హైలైట్:
- అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన అరకు కాఫీ
- ఏజెన్సీలోని 2.50 లక్షల ఎకరాల్లో సాగు
- పలు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు

విశాఖ మన్యంలో కాఫీ తోటల విస్తరణకు సంబంధించి ఐటీసీ.. ఐటీడీఏ పాడేరుతో ఒప్పందం చేసుకుంది. గిరిజన మహిళల ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాల్లో విక్రయం కోసం ఫ్రాంటియర్ మార్కెటింగ్, ఈజీమార్ట్‌లు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని చేసుకున్నాయి. పసుపు మార్కెటింగ్, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఎక్విన్,ఐటీడీఏ మధ్య ఎంఓయూ కుదిరినట్టు అధికారులు తెలిపారు. గిరిజన మహిళా సంఘాల ద్వారా అటవీ ఉత్పత్తులు అమ్మకానికి అవగాహన కల్పించేందుకు ఐఎస్‌బీ కంపెనీ మరో ఒప్పందం చేసుకుంది.
అరకు కాఫీ
అటవీ ప్రాంతాల్లో హోంస్టేల కోసం ఓయో, హూమీ హట్స్ సంస్థలు అంగీకరించాయి. గిరిజన యువతలో నైతిక విలువల పెంపు కోసం మార్పు సొసైటీ, గిరిజన పర్యాటకం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఏపీ టూరిజం ఫోరం ముందుకొచ్చాయి.
అరకు కాఫీని ప్రస్తుతం పాడేరు ఏజెన్సీలో 11 మండలాల్లోని 2.58 లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. దీనిపై ప్రత్యక్షంగా 2.46 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటికే అరకు కాఫీకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. పార్లమెంట్‌లోనూ అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కాఫీని అంతర్జాతీయ విపణికి తీసుకెళ్లేలా ప్రైవేటు సంస్థలతో కలిసి జీసీసీ అవగాహన ఒప్పందం చేసుకుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే గిరిపుత్రుల ఆదాయం మూడు రెట్లు పెరుగుతుంది.