ఏపీలోని రైతులకు ముఖ్య గమనిక. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రాని వారి కోసం ఏపీ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు పడలేదు. అలాంటి రైతులు సంబంధిత పత్రాలతో రైతు సేవా కేంద్రాలను సందర్శించి.. దరఖాస్తు చేసుకుంటే, అధికారులు వాటిని పరిశీలిస్తారు. అర్హత ఉంటే అర్హుల జాబితాలో చేర్చుతారని అధికారులు చెప్తున్నారు. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేసినప్పటికీ కొంతమంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ కాలేదు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పథకం కింద సాయం అందలేదు. అలాగే కొంతమంది రైతులకు పీఎం కిసాన్ యోజన కింద రూ.2000 పడినప్పటికీ.. అన్నదాత సుఖీభవ పథకం కింద అందించే రూ.5000 సాయం అందలేదు. దీంతో అలాంటి వారంతా ఆందోళన చెందుతున్నారు. తమకు సాయం అందదేమోననే సందేహంలో ఉన్నారు. అయితే సాంకేతిక సమస్యలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రైతులు సకాలంలో ఈకేవైసీ పూర్తి చేయకపోవటం, అలాగే రైతుల బ్యాంక్ ఖాతాలు యాక్టివ్‌గా లేకపోవటం, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పెండింగ్ ఉండటం వీటికి కారణాలుగా తెలుస్తోంది. అయితే ఇలాంటి రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.
ఈకేవైసీ పెండింగ్, బ్యాంక్ అకౌంట్ సమస్యలు, భూమికి సంబంధించిన యజమాని మరణం, భూ హక్కుల బదలాయింపులో సమస్యలు, ఆధార్ కార్డుకు భూమికి అనుసంధానం కాకపోవటం వంటి సమస్యలతో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పొందలేని వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. పథకానికి తాము అర్హులమేనని నిరూపించే పత్రాలతో రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలి. దరఖాస్తుకు ఆ పత్రాలను జతచేసి అధికారులకు సమర్పించాలి. అధికారులు అర్హతా ప్రమాణాలను పరిశీలించి.. అర్హత ఉంటే లబ్ధిదారుల జాబితాలో చేర్చుతారు. ఆ తర్వాత వారి అకౌంట్లలోకి డబ్బులు జమ కానున్నాయి.