మూడురోజులుగా హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దవుతోంది. భాగ్యనగరంపై వరుణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. తాజాగా నగర వాసులు మరోసారి కుండపోతకు సిద్ధం కావాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మాదాపూర్, ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి సహా పలుచోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు వాతావరణం కాస్త పొడిగా ఉన్నా రాత్రి వరకు వాన దంచికొడుతుందని అధికారులు చెబుతున్నారు.
అకస్మాత్తుగా వర్షం ప్రారంభమయ్యే అవకాశం ఉందని, బయటకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని, వర్షం కురిసే సమయంలో భారీ హోర్డింగ్‌లు, చెట్ల కింద నిలబడొద్దని అధికారులు అలెర్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ నిలిచిపోయే ప్రాంతాలను ముందుగానే తప్పించుకోవాలని, వాహనాలు తక్కువ లోతైన రోడ్లలో మాత్రమే నడపాలని జాగ్రత్తలు చెబుతున్నారు.
హైదరాబాద్‌లోని 141 వాటర్ లాగింగ్ పాయింట్లలో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తమయ్యాయి. వరద నాలాల నుంచి మూసీలోకి నీళ్లు వెళ్లేందుకు అడ్డంకులు లేకుండా ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. జలమండలి, జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ట్రాఫిక్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, ఫైర్, NDRF బృందాలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. కంట్రోల్‌రూమ్ నుంచి ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీంతో తెలంగాణలోని 7 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఇక తెలంగాణలో సోమవారం(ఆగస్టు 11) 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంది.
హైదరాబాద్‌లో చినుకు పడితే నగరవాసులు నరకం చూస్తున్నారు. భారీ వర్షాలకు ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. రోడ్లయితే నదులను తలపిస్తున్నాయి. వందల సంఖ్యలో కార్లు, బైక్‌లు మెకానిక్ షెడ్లకు క్యూ కడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి వర్ణనాతీతం అనే చెప్పాలి. ఇక జంట జలాశయాలకు భారీగా వరద వస్తోంది. హిమాయత్‌సాగర్ మూడు గేట్లు ఎత్తి 991 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అటు హుస్సేన్‌సాగర్ నీటిమట్టం కూడా గరిష్ఠస్థాయికి చేరింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..