YSRCP Ex MLA Ravindranath Reddy Political Comments in Tirumala: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై టీటీడీ చర్యలకు సిద్దమవుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి రాజకీయ వ్యాఖ్యలు చేశారని టీటీడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను టీటీడీ విజిలెన్స్ విభాగం పరిశీలిస్తోంది.

రవీంద్రనాథ్ రెడ్డి ఏమన్నారంటే?
ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని రవీంద్రనాథ్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రస్తావన తీసుకువచ్చారు. వైఎస్ జగన్ వెంట ఉన్నామని ఈ ఎన్నికల ద్వారా చెప్పడానికి పులివెందుల ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ కూటమి అరాచకాలకు పాల్పడుతోందని.. వైసీపీ కార్యకర్తలను, పులివెందుల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో పంటలు పండటం లేదని ఆరోపించారు.సూపర్ సిక్స్ పేరుతో దొంగ హామీలు ఇచ్చారని.. వాటిలో ఏ ఒక్కటీ కూడా అమలు చేయడం లేదని రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. 2029లో వైఎస్ జగన్ మరోసారి సీఎం కావాలని జనం కోరుకుంటున్నారన్న రవీంద్రనాథ్ రెడ్డి.. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ద్వారా జగన్ వెంటే పులివెందుల జనం ఉన్నారనే సంగతి తెలుస్తుందన్నారు.
ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లి ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నారని.. ఓటింగ్ శాతం తగ్గించేందుకు దారుణాలకు పాల్పడుతున్నారని రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ ఎక్కడా జరగలేదంటూ రవీంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తలుచుకుని ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నామినేషన్ కూడా వేసేవారు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.