Telangana Ministers at Janasena Central Office Mangalagiri:తెలుగు రాజకీయాల్లో ఆదివారం ఇంట్రస్టింగ్ ఘటన చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన ఐదుగురు మంత్రులు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో దిగారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి జనసేన కేంద్ర కార్యాలయం వద్ద కనిపించడం ఆసక్తి రేకెత్తించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య రాజకీయాలు వేడెక్కాయి. సముద్రంలో కలిసే గోదావరి వరద జలాలను వాడుకుని రాయలసీమను సస్యశ్యామలం చేస్తామంటూ పోలవరం బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. సుమారుగా 80 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు రూపకల్పనకు శ్రీకారం చుట్టుంది. అయితే బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రం నీటి హక్కులకు భంగం కలుగుతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టు మీద అభ్యంతరం తెలిపారు. కేంద్ర జలసంఘం వద్ద కూడా దీనిపై తమ అభ్యంతరాలను తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలతో బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి.
ఇలా రెండు రాష్ట్రాల మధ్యన రాజకీయ వాతావరణం వేడెక్కిన తరుణంలో తెలంగాణ మంత్రులు ఐదుగురు.. జనసేన కేంద్ర కార్యాలయంలో దిగటం ప్రాధాన్యం సంతరించుకుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, కోమటిరెడ్డి, వాకిటి శ్రీహరి జనసేన ఆఫీసు ప్రాంగణంలో కనిపించడం ఆసక్తి రేకెత్తించింది.
అయితే వీరంతా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం హెలిప్యాడ్ వాడుకున్నట్లు తెలిసింది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులంతా హెలికాప్టర్‌లో వెళ్లగా.. వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా పిడుగు హరిప్రసాద్ జనసేన నేతలతో కలిసి తెలంగాణ మంత్రులకు స్వాగతం పలికారు. వారితో కలిసి ఫోటోలు దిగారు.