సాధారణంగా మహిళల కంటే పురుషులు పొడవుగా ఉండటం మనం గమనిస్తుంటాం. దీని వెనుక ప్రధానంగా జన్యువులు, హార్మోన్లు, మరియు శారీరక పెరుగుదల వంటి అంశాలు ఉన్నాయి. ఈ కారణాల గురించి తెలుసుకుందాం.
1. ర్మోన్ల పాత్ర:
పురుషులు, మహిళలలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు ఎత్తు తేడాకు ప్రధాన కారణం. పురుషులలో టెస్టోస్టిరాన్ (Testosterone) అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాలు, ఎముకల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఈ హార్మోన్ ప్రభావం వల్ల పురుషులలో యుక్తవయస్సు ఆలస్యంగా ప్రారంభమై, వారి పెరుగుదల ఎక్కువ కాలం కొనసాగుతుంది. దీనికి విరుద్ధంగా, మహిళల్లో ఈస్ట్రోజెన్ (Estrogen) అనే హార్మోన్ అధికంగా ఉంటుంది. ఇది యుక్తవయస్సును త్వరగా ప్రారంభించి, ఎముకల చివరలలో ఉండే గ్రోత్ ప్లేట్స్ త్వరగా మూసుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల మహిళల శరీర ఎదుగుదల త్వరగా ఆగిపోతుంది.
2. యుక్తవయస్సులో పెరుగుదల:
యుక్తవయస్సులో వచ్చే మార్పులు స్త్రీ, పురుషుల ఎత్తులో తేడాలను స్పష్టంగా చూపిస్తాయి. పురుషుల్లో యుక్తవయస్సు సాధారణంగా 11 నుంచి 13 సంవత్సరాల మధ్య మొదలై, 17-18 సంవత్సరాల వరకు పెరుగుతారు. ఈ దశలో టెస్టోస్టిరాన్ ప్రభావం వల్ల ఎముకలు వేగంగా పెరుగుతాయి. మహిళలలో యుక్తవయస్సు 9 నుంచి 11 సంవత్సరాల మధ్య ప్రారంభమై, 15-16 సంవత్సరాలకే పెరుగుదల ఆగిపోతుంది. ఈస్ట్రోజెన్ హార్మోన్ కారణంగా వారి శరీర పెరుగుదల త్వరగా ముగుస్తుంది.
3. జన్యు ప్రభావం:
ఎత్తు అనేది కేవలం హార్మోన్ల వల్ల మాత్రమే కాదు, జన్యువుల ప్రభావం కూడా దీనిపై ఉంటుంది. తల్లిదండ్రుల నుండి సంక్రమించే జన్యువులు మన ఎత్తును చాలా వరకు ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ, హార్మోన్ల ప్రభావం వల్ల ఈ జన్యువుల పనితీరులో తేడాలు వచ్చి, పురుషులు మహిళల కంటే పొడవుగా పెరుగుతారు.