గుంతకల్లుకు చెందిన సాయిసాకేత్ అనే యువకుడు అద్భుతమైన ప్రతిభతో ఇంకా చదువు పూర్తి కాకముందే మంచి జాబ్ సాధించాడు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోన్న సాయి సాకేత్.. అమెరికాలోని ఆప్టివర్ సాఫ్ట్వేర్ సంస్థలో ఏడాదికి రూ.5 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. దీని కన్నా ముందుగా సాయిసాకేత్‌కు పది వారాల ఇంటర్న్‌షిప్‌కు గాను రూ.కోటి వేతనం లభించింది. కోర్సు పూర్తవగానే అదే సంస్థ రూ.5 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం ఇచ్చేందుకు కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది.
హైలైట్:
- గుంతకల్లు యువకుడి ప్రతిభ
- బీటెక్ ఫైనల్ ఇయర్లోనే జాబ్
- ఏడాదికి రూ.5 కోట్ల ప్యాకేజీ

అలానే కోర్సు పూర్తి కాగానే.. అదే కంపెనీలో ఏడాదికి రూ.5 కోట్లు ప్యాకేజీ ఇవ్వడానికి ఆమోదం తెలుపుతూ.. ప్రాథమికంగా ఒప్పందం కుదుర్చుకుందని సాయి సాకేత్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక సాయి సాకేత్ విషయానికి వస్తే.. అతడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ , అనంతపురం జిల్లాలోని గుంతకల్లు. కానీ సాకేత్ తల్లిదండ్రులైన రమేశ్, వాసవి దంపతులు పది సంవత్సరాల క్రిత అమెరికా వెళ్లారు. సాయి సాకేత్ ప్రస్తుతం అక్కడే బీటెక్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న సాకేత్.. చదువు పూర్తి కాకముందే.. ఇంత మంచి ప్యాకేజీతో కొలువకు అర్హత సాధించడం విశేషం.
ఈ జాబ్‌కి ఎంపిక చేయడం కోసం ఆప్టివర్ కంపెనీ నిర్వహించిన అన్ని పరీక్షల్లో సాయి సాకేత్ ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. టెస్ట్‌లో భాగంగా సాఫ్ట్వేర్, బిజినెస్, మ్యాథ్స్ వంటి విభాగాల్లో అత్యంత ప్రతిభ చూపినందుకుగాను సదరు కంపెనీ సాయి సాకేత్‌ను ఈ జాబ్‌కి ఎంపిక చేసింది. కుమారుడికి ఇంత మంచి ప్యాకేజీతో ఉద్యోగం రావడం.. అది కూడా చదువు పూర్తి కాకముందే రావడంపై సాయి సాకేత్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువత అతడిని ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన స్థానికులు సాయి సాకేత్‌ని ప్రశంసిస్తున్నారు.