క్రెడిట్ కార్డు.. సామాన్య, మధ్యతరగతి ఉద్యోగిని ఆదుకుంటున్న అతిపెద్ద ఆధారం.. అవును నిజంగా ఇదే నిజం..! ఎందుకంటే.. చాలీ చాలని జీతంతో జీవితంతో జీవితం గడుపుతున్న చాలా మంది నెల చివరి వరకు సరిపోని పరిస్థితుల్లో ఈ కార్డులు చాలా మందికి ఆధారంగా మారాయి. మరీ ముఖ్యంగా ఆర్థిక అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డు ఒక ఆపద్భాందవుడుగా ఆదుకుంటోందని చెప్పాలి.. పైగా ప్రతి రంగంలోనూ క్రెడిట్ కార్డు వినియోగం పెరిగింది. దీంతో కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు..పెద్ద, చిన్న వ్యాపారులు, విద్యార్థులు ఇలా అందరూ కనీసం ఒక క్రెడిట్ కార్డు వాడుతున్నారు. కానీ, ఒక వ్యక్తి క్రెడిట్ కార్డులను ఆదాయ వనరుగా మార్చుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయ్యాడు. మనీష్ ధమేజా అనే ఈ వ్యక్తి 1,638 చెల్లుబాటు అయ్యే క్రెడిట్ కార్డులను సేకరించాడు.
హైదరాబాద్‌కు చెందిన మనీష్ ధమేజా 1,638 యాక్టివ్ క్రెడిట్ కార్డులతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రెడిట్ కార్డ్ వినియోగదారుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. క్రెడిట్ కార్డులు కేవలం ఆర్థిక సాధనం మాత్రమే కాదు, అవి తన జీవితంలో అంతర్భాగంగా మారాయని మనీష్ చెప్పాడు. క్రెడిట్ కార్డులు లేకుండా నా జీవితం అసంపూర్ణం అని చెబుతున్నాడు. వాటితో వచ్చే బహుమతులు, డిస్కౌంట్లు అద్భుతంగా ఉన్నాయని అతను ఎంతో ఉత్సాహంగా చెప్పుకుంటున్నాడు.
2016లో భారతదేశంలో అధిక విలువ గల నోట్ల రద్దు సమయంలో మనీష్ అందరిలాగే ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొన్నాడు. అప్పటి కష్టకాలంలో అతను కరెన్సీకి బదులుగా డిజిటల్ చెల్లింపులు మొదలు పెట్టాడు. అప్పటి నుండి మనీష్ క్రెడిట్ కార్డులను ఉపయోగించడం ప్రారంభించాడు. క్రమంగా ఆకర్షణీయమైన బహుమతులు, డిస్కౌంట్లతో పాటు ఆర్థిక స్వేచ్ఛను పొందడం ప్రారంభించాడు. ఇది తన క్రెడిట్ కార్డ్ సేకరణను పెంచుకునే అతని ప్రయాణానికి నాంది పలికింది.
ఇవి కూడా చదవండి
ప్రయాణాల విషయానికి వస్తే మనీష్ కు క్రెడిట్ కార్డులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రైల్వే, విమానాశ్రయ లాంజ్‌లు, ఆహారం, స్పా సేవలు, హోటల్ వోచర్లు, విమాన టిక్కెట్లపై డిస్కౌంట్లు, షాపింగ్ వోచర్లు, సినిమా టిక్కెట్లు, గోల్ఫ్ అవకాశాలు మొదలైన అనేక ప్రయోజనాలను అతను పొందుతాడు. ఈ ప్రయోజనాలు క్రెడిట్ కార్డుల పట్ల అతని ఆకర్షణను మరింత పెంచాయి.
క్రెడిట్ కార్డుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళిన మనీష్.. చివరికి 1,638 యాక్టివ్ కార్డులను సేకరించి ప్రపంచంలో అత్యధిక క్రెడిట్ కార్డులు కలిగిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్‌గా నిలిచాడు. ఈ విజయం ఆర్థిక ప్రయోజనాలకే పరిమితం కాకుండా, డిజిటల్ చెల్లింపు వ్యవస్థల సామర్థ్యాన్ని హైలైట్ చేసే ఒక ప్రత్యేక ఉదాహరణ కూడా. మనీష్ ధమేజా క్రెడిట్ కార్డ్ ప్రయాణం జీవితాన్ని సరళీకృతం చేయడానికి, సౌలభ్యాన్ని పెంచడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ఒక నమూనా.