తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి స్టార్ట్ అయ్యింది. గ్రామాల్లో ఎక్కడ చూసిన సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వగా.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా.. పార్టీలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధుల జీతాలు, ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత ఖర్చు చేయాలి..? అనే అంశాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.
జీతాలు ఇలా..
ప్రస్తుతం సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు చెల్లిస్తున్న గౌరవ వేతనాలు 2021లో పెంచిన మొత్తాలే కొనసాగుతున్నాయి. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు నెలకు రూ. 6,500 చొప్పున గౌరవ జీతం పొందుతున్నారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలకు రూ. 13,000 అందుతుండగా అత్యున్నత స్థానిక పదవిలో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్‌కు రూ.1 లక్ష వరకు వేతనం లభిస్తుంది. అయితే గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌లకు మాత్రం ఇప్పటికీ ఎలాంటి గౌరవ వేతనం లభించడం లేదు. ఈ ఎన్నికల వేళ ఈ అంశంపై డిమాండ్లు బలంగా వినిపించే అవకాశం ఉంది.
ఎన్నికల ఖర్చు ఇలా
ఈ ఎన్నికల కోసం తెలంగాణ ఎన్నికల సంఘం అభ్యర్థుల ఖర్చు పరిమితులను ఖరారు చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే, అభ్యర్థులు మూడేళ్లపాటు పోటీకి అనర్హులు అవుతారు. అంతేకాకుండా గెలిచినా కూడా పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 ప్రకారం.. 5,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి గరిష్టంగా రూ. 2.50 లక్షలు ఖర్చు చేయాలి. జెడ్పీటీసీ అభ్యర్థికి రూ. 4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థికి రూ. 1.50 లక్షలు, వార్డు సభ్యుడుగా పోటీ చేసే వ్యక్తి రూ. 50 వేలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది.
అభ్యర్థులు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తేదీ నుంచి 45 రోజులలోపు ఖర్చుల తుది నివేదికను సమర్పించాలి. ఎన్నికల నిర్వహణ కోసం పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే రూ. 325 కోట్ల నిధులను విడుదల చేసింది. ఎన్నికల ప్రవర్తనా కోడ్‌ను కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..