ట్రాఫిక్ రూల్స్ పెట్టేది ప్రయాణికుల భద్రత కోసం. కానీ కొంతమందికి రూల్స్ అతిక్రమించడం ఓ సరదా అయిపోయింది. అందుకే పోలీసులు ఎక్కడికక్కడ కెమెరాలు పెట్టి రూల్స్ అతిక్రమించేవారి బెండు తీస్తున్నారు. పోలీసులకు చిక్కితే పెండింగ్ చలాన్లు కడితేనే వదిలేస్తున్నారు. లేదంటే బండ్లు సీజ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ బైక్‌పై ఉన్న పెండింగ్ చలాన్లు చూసి పొలీసులే నివ్వెరపోయిన పరిస్థితి. అతడి బైక్ మీద 277 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ ఉండటం గమనార్హం. ఆ చలాన్లు మొత్తం కలిపి అతను రూ. 79,845 చెల్లించాల్సి ఉంది. ఈ చలాన్ల రాయుడు కరీంనగర్ పోలీసులకు చిక్కాడు. ఐదు సంవత్సరాల వ్యవధిలో అతనిపై ఈ చలాన్లు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. 277 పెండింగ్ చలాన్లు ఉన్న హీరో యునికార్న్ మోటార్ సైకిల్ (TS 02 EX 1395) ను సీజ్ చేసి పీఎస్‌కు తరలించారు. ఈ చలాన్లు 2019, జూన్ 8 నుంచి 2024, డిసెంబర్ 25 వరకు.. కరీంనగర్, పరిసర ప్రాంతాలలో నమోదయినట్లు పోలీసులు తెలిపారు. గోదాం గడ్డకు చెందిన అబ్దుల్ ఖయ్యూమ్ ఆ బైక్ ఓనర్ అని తెలిపారు. అతడు ఆర్ఎంపీ ప్రాక్టీషనర్.
కాగా హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల 254 సార్లు అతనికి చలాన్ పడింది. కరోనా సమయంలో ఫేస్ మాస్క్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్, ఫోన్ వాడుతూ డ్రైవ్ చేయడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో పాటు సరైన నంబర్ ప్లేట్ లేకపోవడం.. అలానే జిగ్ జాగ్ డ్రైవింగ్ వంటి కారణాలతో మిగిలిన చలాన్లు నమోదయ్యాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.