TCS visakhapatnam operations announcement: నవంబర్ నెల.. ఏపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మార్చేలా నవంబర్ నెలలో అడుగులు పడనున్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అన్నింటికంటే ముందుగా టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. నవంబర్ నెలలో విశాఖ వేదికగా టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అలాగే కాగ్నిజెంట్ కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది. నవంబర్ నెలలో కాగ్నిజెంట్ సీఈవో విశాఖలో పర్యటించనున్నారు.

తొలి అడుగు టీసీఎస్‌దే.. నవంబర్ నుంచి పనులు..
విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో తొలుత ఒప్పందం చేసుకున్నది కూడా టీసీఎస్ కావటం విశేషం. ఇక టీసీఎస్ కోసం రుషికొండ సమీపంలోని ఐటీహిల్స్‌పై భవనాన్ని కూడా ఏపీ ప్రభుత్వం కేటాయించింది. హిల్-3లోని మిలీనియం టవర్స్ లీజు ప్రాతిపదికన కేటాయించింది. ఈ భవనంలో ఉద్యోగులు పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ ఏర్పాట్లు కూడా తుది దశకు చేరుకున్నాయి. నవంబర్ నెలలో విశాఖ వేదికగా టీసీఎస్ కార్యకలాపాలు మొదలుపెట్టనుంది. ఈ విషయాన్ని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా తెలిపారు. టీసీఎస్ క్యాంపస్‌లో తొలిదశలో 2 షిఫ్టులలో 2000 మంది ఉద్యోగులు పనిచేస్తారు. ఆ తర్వాత ఉద్యోగుల సంఖ్యను క్రమంగా ఆరు వేలకు పెంచాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకు తగ్గట్లుగా మిలీనయం టవర్స్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ భవనం నుంచి తాత్కాళికంగా కార్యకలాపాలు సాగిస్తూనే.. టీసీఎస్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. రూ.1,370 కోట్లతో 12000 మందికి ఉపాధి కల్పించనుంది. టీసీఎస్ క్యాంపస్ కోసం ఏపీ ప్రభుత్వం ఐటీహిల్-3పై 22 ఎకరాలను కేటాయించింది. ఎకరా 99 పైసలకు చొప్పున కేటాయింపులు చేశారు.
టీసీఎస్ బాటలో కాగ్నిజెంట్..
మరోవైపు టీసీఎస్ బాటలోనే మరో ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టనుంది. రూ.1,582 కోట్లతో విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. కాగ్నిజెంట్ క్యాంపస్ ద్వారా సుమారుగా 8000 మందికి ఉద్యోగాలు రానున్నాయి.. ఈ నేపథ్యంలో కాగ్నిజెంట్ సంస్థకు కూడా ఎకరా భూమి 99 పైసలకు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాపులుప్పాడ వద్ద 21.31 ఎకరాల భూమి కేటాయించింది. మరోవైపు కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీఈవో రవి కుమార్ వచ్చే నవంబర్‌లోనే విశాఖపట్నం పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనే ఆయన విశాఖ కాగ్నిజెంట్ క్యాంపస్ ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇవి కాకుండా గూగుల్ డేటా సెంటర్.. రూ.లక్ష కోట్లతో టీసీఎస్ డేటా సెంటర్ ఏర్పాటు కానున్నాయి.