అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. ధనవంతుడు, పేదవాడు అనే తేడా లేకుండా జీవితం రాత్రికి రాత్రే మారిపోతుంది. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన ఓ సాధారణ గిరిజన కార్మికుడి విషయంలో ఇలాంటి అద్భుతమే జరిగింది. గుడి దర్శనం చేసుకుని వస్తుండగా రోడ్డు పక్కన దొరికిన ఒక మెరిసే రాయి అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. 59 ఏళ్ల ఆ గిరిజనుడి పేరు గోవింద్ సింగ్. ఇతను రహునియా గర్జర్ నివాసి. ఎప్పటిలాగే ఉదయం ఖేర్ మాత ఆలయాన్ని దర్శించుకుని తిరిగి ఇంటికి వస్తున్నాడు. దారిలో రోడ్డు పక్కన ఏదో మెరుస్తూ కనిపించింది. గోవింద్ ఆసక్తిగా దాన్ని తీసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. కుటుంబ సభ్యులకు చూపించిన తర్వాత అది సాధారణ రాయి కాదని వజ్రం అని తెలిసింది. అది చిన్న వజ్రం కాదు ఏకంగా 4.04 క్యారెట్ల రత్న నాణ్యత వజ్రం అని తేలింది.
ఫుల్ డిమాండ్
గోవింద్ వెంటనే ఆ వజ్రాన్ని పన్నాలోని వజ్ర కార్యాలయానికి తీసుకెళ్లాడు. అక్కడ నిపుణులు అనుపమ్ సింగ్ దానిని పరిశీలించి.. అది అత్యంత విలువైన రత్నాల నాణ్యత గల వజ్రమని ధృవీకరించారు. మార్కెట్‌లో ఈ వజ్రానికి మంచి డిమాండ్ ఉందని ఆయన తెలిపారు. ఈ వజ్రాన్ని త్వరలో వేలం వేయనున్నారు. వేలం ద్వారా వచ్చిన అత్యధిక మొత్తంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం 11.5 శాతం రాయల్టీ మినహాయించి, మిగిలిన మొత్తాన్ని కార్మికుడైన గోవింద్ సింగ్ ఖాతాలో జమ చేస్తారు.
ఇల్లు కడతాను
కూలీలుగా, చిన్న రైతులుగా పనిచేసే గోవింద్ సింగ్ కుటుంబానికి ఇది అద్భుతమైన అవకాశం. వజ్రం దొరికినందుకు గోవింద్ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ.. “గత మూడేళ్లుగా నేను మాతా రాణిని చూడటానికి క్రమం తప్పకుండా వెళ్తున్నాను. నాకు ప్రస్తుతం ఒక ట్రాక్టర్ ఉంది. వజ్రం డబ్బు వచ్చిన తర్వాత నేను ముందుగా మా ఇంటి నిర్మాణం పూర్తి చేస్తాను. ఇంకా డబ్బు మిగిలితే కొత్త ట్రాక్టర్ కూడా కొనుక్కుంటాను” అని తెలిపారు.
రోడ్డు పక్కన కుతూహలంతో తీసుకున్న ఒక వస్తువు ఒక సాధారణ గిరిజన కార్మికుడి జీవితాన్ని ఒక్కసారిగా మార్చి అతనికి ఒక కల లాంటి అనుభూతిని మిగిల్చింది. పన్నా జిల్లా వజ్రాలకు ప్రసిద్ధి చెందినా, ఇలా అకస్మాత్తుగా అదృష్టం తగలడం అరుదైన విషయం.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..