హైదరాబాద్ పాతబస్తీలోని దబీర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పవిత్ర ఖురాన్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక యువకుడు ఆనందంగా తాను జ్యూస్ తాపిస్తున్నానంటూ పలు దుకాణాలు, అపార్టుమెంట్లు చుట్టూ తిరిగి జనాలకు జ్యూస్ ఇచ్చిన ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఎందుకంటే ఆ జ్యూస్ తాగిన 12 మంది అకస్మాత్తుగా నిద్రలోకి జారుకున్నారు. దాదాపు 15 గంటల తర్వాత నిద్రలేచారు. స్పృహలోకి వచ్చాక కూడా అంతా అయోమయానికి గురయ్యారు. అసలేం జరిగిందనే విషయం ఎవరికీ గుర్తులేకపోవడం గమనార్హం
పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. ఆ వ్యక్తి ఇచ్చిన జ్యూస్‌ను కొంతమంది ఎలాంటి అభ్యంతరం లేకుండా తీసుకుని తాగారు. మరికొందరు మాత్రం తాగడానికి నిరాకరించారు. జ్యూస్ తాగిన వారిలో గడచిన కొన్ని గంటల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దాదాపు 12 మంది వ్యక్తులు ఆ జ్యూస్ తాగిన తర్వాత తీవ్రమైన నిద్రలోకి వెళ్లిపోయారు. వీరంతా 12 నుంచి 15 గంటల తరువాతే మళ్లీ నిద్రలేచి, పూర్తిగా అయోమయ స్థితిలోకి చేరినట్లు తెలిసింది. స్పృహలోకి వచ్చాక కూడా అంతా అయోమయానికి గురయ్యారు. అసలేం జరిగిందనే విషయం ఎవరికీ గుర్తులేకపోవడం గమనార్హం. కొందరైతే ఉదయం లేచినప్పటికీ సాయంత్రం వరకూ తామేం చేశామో తెలుసుకోలేని స్థితిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ విచిత్ర పరిణామాలను గమనించిన వారు వెంటనే దబీర్‌పురా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించింది. పోలీసులు బాధితుల స్టేట్‌మెంట్ తీసుకోవడమేకాకుండా ఆ యువకుడి పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. యువకుడు ఎక్కడి నుండి వచ్చాడు, అతని ఉద్దేశం ఏమిటి, ఇచ్చిన జ్యూస్‌లో ఏవైనా మత్తు పదార్థాలు కలిపారా అన్న కోణాల్లో విచారణ జరుగుతోంది. డబ్బా నుండి మిగిలిన జ్యూస్ నమూనాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు పోలీసులు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.
అలాగే ఆ యువకుడు తిరిగిన ప్రతి అపార్టుమెంట్, దుకాణాల దగ్గరికి వెళ్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటనతో స్థానికుల్లో భయం నెలకొంది. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నా వారికి పూర్తిగా ఆరోగ్య పరిస్థితి కుదుటపడేవరకు చెప్పలేం అంటున్నారు. జ్యూస్‌లో మత్తు పదార్థాలు ఉన్నాయా లేక తీవ్రమైన నిద్ర వచ్చేలాంటి పదార్థాలేమైనా కలిపారా అనేది నివేదికలు రావాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రజలు అపరిచితులిచ్చే పదార్థాలు తీసుకోవద్దని, ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.