
విశ్వంలో జననం, మరణం అనేది సహాజం. పుట్టిన వారు మరణించక తప్పదు, మరణించిన వారు జన్మించక తప్పదు అనేది ఎప్పటి నుంచో ఉన్న మాట. కానీ మరణ సమయంలో మన మెదడులో ఏమి జరుగుతుంది? ఆ క్షణంలో మనం ఏమి ఆలోచిస్తాము? మన మనస్సులలో ఎలాంటి భావోద్వేగాలు పుడతాయి అనేది అంతుచిక్కని రహస్యం. దానిని కనిపెట్టేందుకు ఇటీవల శాస్త్రవేత్తలు కొన్ని అధ్యయనాలు చేశారు. ఈ అధ్యయనంలో, శాస్త్రవేత్తలు ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ (EEG) పరికరంతో కోమాలో ఉన్న ఒక రోగిని పరీక్షించారు. అతడు కాసేపట్లో చనిపోతాడు అనే సమయంలో తీసిన EEG రికార్డింగ్‌లు ఆ శాస్త్రవేత్తలకు ఆశ్చర్యకరమైన మెదడు కార్యకలాపాలను చూపించాయి.
చివరి క్షణంలో అతని మెదడు ‘గామా ఆసిలేషన్స్’ అని పిలువబడే తీవ్రమైన, శక్తివంతమైన తరంగాలను ఉత్పత్తి చేసింది. ఈ తరంగాలు సాధారణంగా ఒక వ్యక్ ఏదైనా విషయాన్ని గుర్తుంచుకున్నప్పుడు, కలలు కన్నప్పుడు లేదా తీవ్రమైన భావోద్వేగాలకు లోనైనప్పుడు ఉత్పత్తి అవుతాయి. అంటే, మరణానికి కొన్ని క్షణాల ముందు, ఒక వ్యక్తి మెదడు అతని జీవితంలోని పాత జ్ఞాపకాలు, సంతోషకరమైన క్షణాలను గుర్తు చేసుకుంటుందని శాస్త్రవేత్తలు గమనించారు.
శాస్త్రవేత్తల ప్రకారం, మరణ సమయంలో మెదడు అత్యంత చురుగ్గా ఉంటుంది. గుండె కొట్టుకోవడం ఆగిపోయినా, మెదడు విద్యుత్ కార్యకలాపాలు కొంత సమయం పాటు కొనసాగుతాయి. ఆ సమయంలో, వ్యక్తి తన జీవితంలోని సంతోషకరమైన క్షణాలను తిరిగి అనుభవిస్తాడు. కొన్నిసార్లు ఇది ఒక కలలా ఉంటుంది. ప్రతిదీ చాలా త్వరగా జరుగుతుంది, కానీ మనస్సు ఆనందం, శాంతితో నిండి ఉంటుంది.
ఈ అధ్యయనం తర్వాత మనిషి చనిపోయిన తర్వాత కూడా మన మెదడు కొన్ని క్షణాలు మనుగడ సాగిస్తుందా? అనే కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుంది. చరిత్రలో మొట్టమొదటిసారిగా, శాస్త్రవేత్తలు జీవించి ఉన్న వ్యక్తిలో మరణ సమయంలో మెదడు పనితీరును కనుగొన్నారు. అందువల్ల, మరణ సమయంలో, భయం లేదా బాధ కంటే మెదడులో ఎక్కువ శాంతి, ప్రశాంతత ఉంటుందని చెప్పవచ్చు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.