Visakhapatnam Imaginovate Technologies Land Allocated: విశాఖపట్నంలో ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రభుత్వం 4.05 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ సంస్థ రూ.140 కోట్ల పెట్టుబడులతో అత్యాధునిక ఐటీ క్యాంపస్‌ను నిర్మించనుంది, దీని ద్వారా 2,600 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టుతో విశాఖపట్నం ఐటీ హబ్‌గా మరింత బలపడనుంది. మరోవైపు ఇవాళ ఢిల్లీలో గూగుల్, ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. విశాఖపట్నంలో రూ.87520 కోట్ల పెట్టుబడులతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.
హైలైట్:
- ఆంధ్రప్రదేశ్‌కు మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ వచ్చేస్తోంది
- విశాఖలో ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ క్యాంపస్
- 4.05 ఎకరాల భూమి కేటాయింపు.. ఎకరా రూ.2 కోట్లు

ఏపీ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు అన్ని విధాలా సహకారం అందిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనలో ఏపీఐఐసీ కీలక పాత్ర పోషించనుంది. ఈ పెట్టుబడితో విశాఖపట్నం ఐటీ హబ్‌గా మరింత బలపడనుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు, నగర ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుంది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ విశాఖపట్నంలో ఐటీ కార్యకలాపాలు నిర్వహించేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తోంది.
‘నాలాగే’.. పెమ్మసానిపై చంద్రబాబు ప్రశంసలు
మరోవైపు విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ మధ్య ఢిల్లీలో చారిత్రక ఒప్పందం కుదిరింది. తాజ్‌మాన్‌సింగ్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, గూగుల్ క్లౌడ్ ఆసియా ఫసిఫిక్ విభాగం అధ్యక్షుడు కరణ్ బజ్వాలు పాల్గొన్నారు. విశాఖపట్నాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నగరంగా మార్చేందుకు గూగుల్ భారీ పెట్టుబడి పెట్టింది. సుమారు 15 బిలియన్ అమెరికన్ డాలర్లతో ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టును గూగుల్ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2028-32 మధ్య రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా రూ.10,518 కోట్లు అదనంగా సమకూరుతుందని, 1,88,220 ఉద్యోగాలు వస్తాయని అంచనా. గూగుల్ క్లౌడ్ ఆధారిత కార్యక్రమాల వల్ల ఐదేళ్లలో రూ.47,720 కోట్ల ఉత్పాదకత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.