రేషన్ కార్డుదారులు రేషన్ బియ్యం కోసం రేషన్ షాపుల వద్ద నిరీక్షించాల్సిన అవసరం లేదు. క్యూలైన్లలో ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా.. ఏపీ ప్రభుత్వం టెక్నాలజీ వాడుతోంది. ఇందులో భాగంగా కొత్త ఈ పోస్ యంత్రాలను రేషన్ డీలర్లకు అందించారు. వైఫై ఆధారంగా పనిచేసే ఈ పోస్ యంత్రాల ద్వారా సిగ్నల్స్ సమస్యకు చెక్ పెట్టింది. గతంలో సెల్ సిగ్నల్స్ సాయంతో ఈ పోస్ యంత్రాలు పనిచేసేవి. సిగ్నల్స్ అందకపోవటంతో రేషన్ సరుకుల పంపిణీ ఆగిపోయేది. దీంతో లబ్ధిదారులు ఎదురుచూడాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు వైఫై సాయంతో పనిచేసే యంత్రాలు అందించడంతో సిగ్నల్స్ సమస్యకు చెక్ పడింది.

మరోవైపు రేషన్ వ్యవస్థలోనూ ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. వైసీపీ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేశారు. అయితే టీడీపీ కూటమి సర్కారు ఎండీయూ వాహనాలను రద్దు చేసింది. వాటి స్థానంలో పాత పద్ధతే తీసుకువచ్చింది. రేషన్ డీలర్ల ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నారు. నెలలో 15 రోజుల పాటు రేషన్ దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే దివ్యాంగులు, వృద్ధులకు ముందుగానే ఐదు రోజులపాటు ఇళ్ల వద్దనే రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నారు.
అయితే రేషన్ సరుకుల కోసం లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద వేచి చూడాల్సిన పనిలేకుండా ఏపీ ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది. ఇందులో భాగంగా కొత్త ఈ పోస్ యంత్రాలను తీసుకువచ్చింది.ఈ పోస్ యంత్రాల సాయంతో రేషన్ షాపుల వద్ద జనం ఎదురుచూడాల్సిన అవసరం తప్పనుంది. పాత ఈ – పోస్ యంత్రాలు సెల్ ఫోన్ సిమ్ సాయంతో పనిచేసేవి. దీంతో సిగ్నల్ అందకపోవటంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడేవారు. దీంతో రేషన్ సరుకుల సరఫరాలో ఆలస్యం జరిగేది. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్త వెర్షన్‌తో వైఫై సాయంతో పనిచేసే ఈ పోస్ యంత్రాలను అందించింది. దీంతో సిగ్నల్స్ సమస్యకు చెక్ పడింది. ఆలస్యం లేకుండా రేషన్ సరుకుల పంపిణీ జరుగుతోంది.
కొత్త ఈ పోస్ యంత్రాలు.. ఎలా పనిచేస్తాయంటే..
కొత్త ఈ పోస్ యంత్రాలలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేశారు. అలాగే స్మార్ట్ రేషన్ కార్డులోని క్యూఆర్ కోడ్‌ను ఈ పోస్ యంత్రాలతో స్కాన్ చేసినప్పుడు కార్డులోని వివరాలు మెషీన్‌లో నమోదవుతాయి. అలాగే ఏయే సరుకులు ఎంత మొత్తంలో ఇవ్వాలనే వివరాలు రికార్డవుతాయి. అలాగే ఫింగర్ ప్రింట్ పడకపోతే ఐరిస్ విధానంలోనూ ఇవి పనిచేసేలా డిజైన్ చేశారు. దీంతో రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తప్పుతోందని లబ్ధిదారులు చెప్తున్నారు.