అమరావతిలో గవర్నర్ నివాసం రాజ్ భవన్ నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం నిధులు, పాలనా అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసింది. అమరావతిలో 212 కోట్ల రూపాయలతో రాజ్ భవన్ నిర్మించాలని ఇటీవల జరిగిన సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయించారు. తాజాగా సీఎఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 212 కోట్లతో అమరావతిలో రాజ్ భవన్ నిర్మాణం కోసం జీవో జారీ చేశారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో దీనిని నిర్మించనున్నారు.

అమరావతిలో కీలక నిర్మాణాలు..
మరోవైపు రాజధాని అమరావతి నిర్మా్ణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. అమరావతిలో కీలక ప్రాజెక్టులు చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల కోసం ఉమ్మడి కేంద్ర సచివాలయం కూడా నిర్మించనున్నారు. అలాగే అందులో పనిచేసే ఉద్యోగుల కోసం రెసిడెన్షియల్ కాంప్లె్క్స్ నిర్మించనున్నారు. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆమోదం లభించింది. రూ.2,787 కోట్లతో ఈ రెండు ప్రాజెక్టులను చేపట్టనున్నారు. రూ. 1458 కోట్లతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ కోసం రూ.1,329 కోట్లు ఖర్చు చేయనున్నారు. అయితే ఈ రెండు కీలక ప్రాజెక్టులను కూడా కేంద్ర ప్రజాపనుల విభాగం చేపడుతోంది. మరోవైపు 2018లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం కోసం 22.53 ఎకరాలు కేటాయించింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో 5.53 ఎకరాల భూమిని.. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ వెలుపల 17 ఎకరాలు కేటాయించింది. అయితే ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావటంతో ఈ ప్రాజెక్టులు ఎక్కడిక్కడే ఆగిపోయాయి. 2024 ఏపీ ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో వీటిలో మళ్లీ కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఇటీవల వీటి నిర్మాణం కోసం ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు అంగీకారం తెలిపింది.