ఇంటర్నెట్ కనెక్టివిటీ రంగంలో సరికొత్త విప్లవానికి తెర లేచింది. ప్రముఖ టెక్ కంపెనీ టీపీ లింక్.. క్వాల్‌కామ్ సహకారంతో వైఫై 8 సాంకేతికత యొక్క మొదటి టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. వైఫై 8 అనేది కేవలం వేగంపై మాత్రమే కాకుండా కనెక్షన్ స్టెబిలిటీ, విశ్వసనీయతపై కూడా దృష్టి సారించే నెక్ట్స్ జనరేషన్ వైర్‌లెస్ టెక్నాలజీ. వైఫై 8 టెక్నాలజీని IEEE అభివృద్ధి చేసింది.
హైస్పీడ్ నెట్..
వేగం, జాప్యం: ఇది ప్రస్తుత వైఫై 7 కంటే దాదాపు 25 శాతం వేగవంతమైన స్పీడ్‌ను, అత్యంత తక్కువ జాప్యాన్ని అందిస్తుంది.
స్థిరత్వం: ఈ టెక్నాలజీ కనెక్షన్ డ్రాప్‌లను తగ్గిస్తుంది. రద్దీగా ఉండే ప్రాంతాలలో లేదా బలహీనమైన సిగ్నల్ ఉన్న చోట్ల కూడా స్థిరమైన, మెరుగైన ఇంటర్నెట్ కనెక్షన్‌ను అందిస్తుంది.
సామర్థ్యం: Wi-Fi 8 మెరుగైన శక్తి సామర్థ్యాన్ని, పీర్-టు-పీర్ కమ్యూనికేషన్‌ను కలిగి ఉంటుంది.
ఎవరి కోసం ఈ టెక్నాలజీ..?
ఈ సాంకేతికతను సాధారణ వినియోగదారుల కంటే ముఖ్యంగా అధిక డిమాండ్ ఉన్న వారి కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు.
- ఏఐ వ్యవస్థలు
- రోబోటిక్స్, క్లిష్టమైన పనులు
- పారిశ్రామిక ఆటోమేషన్ రంగాల డిమాండ్లను తీర్చడం దీని లక్ష్యం
టెస్ట్ విజయం
TP-Link, క్వాల్‌కామ్ సహకారంతో మొదటి ప్రోటోటైప్ వైఫై8 డివైజ్‌ను తయారు చేసింది. డేటాను విజయవంతంగా బదిలీ చేసి కీలకమైన సిగ్నల్, డేటా వేగాన్ని నిరూపించింది. ఇది వైఫై 8 వాణిజ్యపరమైన విస్తరణ దిశగా వేసిన కీలక అడుగు.
దేశంలో ఎప్పుడు వస్తుంది..?
దేశంలో Wi-Fi 8 విస్తరణకు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం స్పెక్ట్రమ్ కేటాయింపు సంక్లిష్టతలు. టెలికాం ఆపరేటర్లు 6GHz బ్యాండ్‌ను మొబైల్ సేవల కోసం ఉంచాలని కోరుతుంటే, టెక్ కంపెనీలు మాత్రం దీనిని Wi-Fi కోసం తెరవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రభుత్వం 6GHz బ్యాండ్‌పై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో దేశంలో Wi-Fi 8 రాక ఆలస్యం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త టెక్నాలజీతో భవిష్యత్తులో ఇంటర్నెట్ వినియోగం పూర్తిగా మారిపోనుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..