గుడ్లు అంటే శక్తికి, పోషకాలకు కేరాఫ్ అడ్రస్ అని అంటారు. చౌకగా లభించడం, శరీర బలాన్ని పెంచడం వంటి కారణాల వల్ల చాలా మంది ప్రతిరోజూ గుడ్లు తింటారు. అటు డాక్టర్లు సైతం రోజూ గుడ్డు తినమని చెబుతారు. అయితే గుడ్లు తినే వారికి షాకింగ్ కలిగించే వార్త ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. JAMA నెట్‌వర్క్‌లో ప్రచురిచిన ఒక కొత్త అధ్యయనం గుడ్డు వినియోగంపై సంచలన విషయాన్ని వెల్లడించింది. దీంతో చాలా మందిలో ఆందోళన మొదలైంది.
కొత్త అధ్యయనంలో ఏముంది..?
నార్త్‌వెస్ట్రన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు 29,615 మందిపై అధ్యయనం చేశారు. ఈ నివేదిక ప్రకారం.. ప్రతిరోజూ గుడ్లు తినడం వల్ల గుండె జబ్బులు, మరణ ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. ప్రతిరోజూ సగం గుడ్డు తినడం వల్ల 17.5 ఏళ్ల కాలంలో గుండె జబ్బుల ప్రమాదం 6 శాతం, మరణ ప్రమాదం 8 శాతం పెరుగుతుందని తేలింది. గుడ్లలోని కొలెస్ట్రాల్ దీనికి ప్రధాన కారణమని పరిశోధకులు చెబుతున్నారు.
ఒక గుడ్డులో ఎంత కొలెస్ట్రాల్..?
పరిశోధనలో భాగంగా పాల్గొన్న వ్యక్తులు ఎన్ని గుడ్లు తిన్నారు.. ఎలాంటి ఆహారం తీసుకున్నారు.. ఎంత వ్యాయామం చేశారు.. వంటి వివరాలను సేకరించారు. వారి ఆహారాన్ని 17.5 ఏళ్లు పర్యవేక్షించిన తర్వాత ఈ ఫలితాలు వచ్చాయి. ఒక గుడ్డులో సుమారుగా 186 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుందని వెల్లడైంది. ఆహారం ద్వారా తీసుకునే ప్రతి 300 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బుల ప్రమాదం 17 శాతం, మరణ ప్రమాదం 18 శాతం పెరుగుతుందని నివేదిక స్పష్టం చేసింది. గుడ్లలోని ఈ కొలెస్ట్రాల్ శరీరానికి హానికరం అని, అందుకే ఈ వ్యక్తులలో గుండె జబ్బుల ప్రమాదం పెరిగిందని పరిశోధకులు తెలిపారు.
నిపుణులు ఏమంటున్నారు..?
గుడ్లు నిజంగా మంచి శక్తి వనరు అయినప్పటికీ తాజా అధ్యయనం గుడ్లలోని కొలెస్ట్రాల్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల ప్రతిరోజూ గుడ్లు తినేవారు దాని పరిమాణాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని సూచించబడింది. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కేవలం గుడ్లనే కాకుండా మొత్తం ఆహారం, తీసుకునే వ్యాయామం వంటి ఇతర జీవనశైలి అంశాలపై కూడా శ్రద్ధ వహించడం ముఖ్యమని నిపుణులు తెలియజేశారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..