ODI Record : వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఆడిన బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా ? 50 ఏళ్ల క్రితం అప్పటి 60 ఓవర్ల వన్డే ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌కు చెందిన దిగ్గజ బ్యాట్స్‌మెన్ గ్లెన్ టర్నర్ నెలకొల్పిన ఒక అద్భుతమైన రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. టర్నర్ ఏకంగా 201 బంతులు ఆడి ప్రపంచ రికార్డు సృష్టించారు. అత్యధిక బంతులు ఆడిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో ఇద్దరు భారత దిగ్గజాలు కూడా ఉన్నారు. వారిలో ఒకరు కేవలం 36 పరుగులు చేస్తే, మరొకరు వన్డే చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) సాధించారు. ఆ ఏడుగురు బ్యాట్స్‌మెన్‌ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వన్డే అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఆడిన ప్రపంచ రికార్డు న్యూజిలాండ్‌కు చెందిన దిగ్గజ ఓపెనర్ గ్లెన్ టర్నర్ పేరిట ఉంది. టర్నర్ 1975లో ఈస్ట్ ఆఫ్రికా జట్టుపై ఏకంగా 201 బంతులు ఎదుర్కొని నాటౌట్‌గా 171 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో అతను 16 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. ఈ రికార్డు 50 ఏళ్లు దాటినా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.
ఈ జాబితాలో రెండో స్థానంలో కూడా గ్లెన్ టర్నరే ఉండటం విశేషం. 1975లోనే భారత్‌పై టర్నర్ 177 బంతులు ఆడి, నాటౌట్‌గా 114 పరుగులు సాధించారు.
సునీల్ గవాస్కర్ (174 బంతులు)
ఈ జాబితాలో అత్యధిక బంతులు ఆడిన నలుగురు బ్యాట్స్‌మెన్‌లలో భారత్ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ఒకరు. అయితే ఆయన ఆటతీరు రికార్డును పక్కన పెడితే విమర్శలకు దారి తీసింది. 1975లో ఇంగ్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో గవాస్కర్ ఏకంగా 174 బంతులు ఎదుర్కొన్నారు. అయితే ఈ సుదీర్ఘ ఇన్నింగ్స్‌లో అతను కేవలం ఒకే ఒక్క ఫోర్ కొట్టి, నాటౌట్‌గా 36 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.
రోహిత్ శర్మ (173 బంతులు)
సునీల్ గవాస్కర్ ఒక వైపు నెమ్మదిగా ఆడితే, భారత విధ్వంసకర ఓపెనర్ రోహిత్ శర్మ ఈ జాబితాలో ఉండి కూడా తనదైన శైలిని ప్రదర్శించాడు. 2014లో శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 173 బంతులు ఆడి, ఏకంగా 264 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఇన్నింగ్స్ ఇప్పటికీ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉంది. రోహిత్ తన ఇన్నింగ్స్‌లో 33 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు కొట్టాడు.
జాబితాలోని ఇతర దిగ్గజాలు
ఈ జాబితాలో మిగిలిన స్థానాల్లో పాకిస్తాన్, వెస్టిండీస్ దేశాలకు చెందిన దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. పాకిస్తాన్ మాజీ ఓపెనర్ మొహ్సిన్ ఖాన్ 1983లో వెస్టిండీస్‌పై 176 బంతులు ఆడి 70 పరుగులు చేసి మూడవ స్థానంలో ఉన్నారు. వెస్టిండీస్ దిగ్గజం గార్డన్ గ్రీనిడ్జ్ 1979లో భారత్‌పై 173 బంతులు ఆడి 106 పరుగులు చేసి ఆరో స్థానంలో ఉన్నారు. ఏడవ స్థానంలో ఇంగ్లాండ్‌కు చెందిన బిల్ ఏథీ ఉన్నారు. అతను 1986లో న్యూజిలాండ్‌పై 172 బంతుల్లో నాటౌట్‌గా 142 పరుగులు చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..