AFG vs BAN : ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌పై జరిగిన 3 వన్డేల సిరీస్‌లో సంచలన ప్రదర్శన చేసింది. అబుదాబిలో అక్టోబర్ 14న జరిగిన చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచి, సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇది ఆఫ్ఘనిస్తాన్‌కు వరుసగా 5వ వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. చివరి వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏకంగా 200 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అబుదాబిలో ఈ రికార్డు తేడాతో ఓడిపోవడం బంగ్లాదేశ్‌కు ఇదే మొదటిసారి.
ఆఫ్ఘనిస్తాన్‌కు వరుసగా ఐదో వన్డే సిరీస్ విజయాన్ని అందించడంలో ఇబ్రహీం జద్రాన్ కీలక పాత్ర పోషించాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో జద్రాన్ మొత్తం 213 పరుగులు సాధించాడు. ఈ పరుగులు 71 సగటుతో 14 ఫోర్లు, 3 సిక్సుల సహాయంతో చేశాడు. అయితే, ఈ సిరీస్‌లో జద్రాన్ రెండుసార్లు సెంచరీని కేవలం 5 పరుగుల తేడాతో కోల్పోయాడు. సిరీస్‌లో రెండో, మూడో వన్డేల్లో అతడు 95 పరుగుల ఇన్నింగ్స్ ఆడటం విశేషం.
చివరి వన్డేలో, ఇబ్రహీం జద్రాన్ (95 పరుగులు), మహ్మద్ నబీ (62 పరుగులు) అద్భుతంగా ఆడటంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. 294 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌లకు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు కేవలం 27.1 ఓవర్లలో 93 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ 200 పరుగుల భారీ తేడాతో మ్యాచ్‌ను గెలిచి, సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
బంగ్లాదేశ్ పతనాన్ని శాసించిన బౌలర్‌లలో ప్రధానంగా బిలాల్ షామీ ముందున్నాడు. బిలాల్ షామీ 7.1 ఓవర్లలో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్‌పై వన్డేల్లో 5 వికెట్లు తీసిన మూడో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్‌గా అతడు నిలిచాడు. అతడితో పాటు, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా 6 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసి బంగ్లాదేశ్ పతనాన్ని వేగవంతం చేశాడు.
ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకే ఒక్క ఆటగాడు మాత్రమే 10 పరుగులు దాటగలిగాడు. ఓపెనర్ సైఫ్ హసన్ ఒక్కడే అత్యధికంగా 43 పరుగులు చేశాడు. మిగిలిన 10 మంది బ్యాట్స్‌మెన్‌లు కనీసం డబుల్ డిజిట్ కూడా చేరుకోలేకపోయారు. రన్స్ తేడాతో ఆఫ్ఘనిస్తాన్ సాధించిన రెండో అతిపెద్ద వన్డే విజయం ఇదే. గతంలో 2024 డిసెంబర్‌లో జింబాబ్వేపై 234 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ వరుసగా 5వ వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. ఈ ఐదు సిరీస్‌లలో బంగ్లాదేశ్‌పై గెలిచిన సిరీస్‌లు రెండు ఉన్నాయి. మిగిలిన సిరీస్‌లు ఐర్లాండ్, సౌతాఫ్రికా, జింబాబ్వేపై సాధించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..