
మటన్ ప్రియులకు దాని రుచి ఏదైనా వంటకాన్ని ప్రత్యేకంగా మారుస్తుందని తెలుసు. అది ఆదివారం భోజనం అయినా, పండగ విందు అయినా, లేదా ప్రత్యేకించి కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరిన సందర్భంలోనై ఏ పార్టీ అయినా మటన్ గురించి మాట్లాడినంత మాత్రాన ఆకలి రెట్టింపు అవుతుంది. కానీ, కొన్నిసార్లు తొందరపాటు లేదా తెలిసి తెలియక పోవడం వల్ల ప్రజలు నకిలీ మటన్ కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటిది పైకి బాగానే కనిపిస్తుంది. కానీ, లోపల కుళ్ళిపోయి ఉంటుంది. ఇది వంటకం రుచిని పాడు చేయడమే కాకుండా అనారోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. మీ మటన్ వంటకాలు ఎప్పుడూ రంగు, రుచితో పాటు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయకూడదనుకుంటే మటన్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. మటన్ తాజాదనాన్ని దాని నాణ్యత, వాసన, రంగు ద్వారా అంచనా వేయడం నేర్చుకోవాలి. తాజా మటన్ మంచి రుచిని కలిగి ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే..
మటన్ రంగును గమనించండి:
మంచి మటన్ ఎల్లప్పుడూ లేత ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటుంది. రంగు చాలా ముదురు ఎరుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తే, అది పాతది. ఎప్పుడో కట్‌చేసి బహిరంగ ప్రదేశంలో నిల్వ చేయబడిందని అర్థం. తాజా మటన్ ఎప్పుడూ కొద్దిగా మెరుస్తూ కనిపిస్తుంది. అదే పాత మటన్ సాధారణంగానే నిస్తేజంగా ఉంటుంది.
మటన్‌ను దాని వాసన ద్వారా గుర్తించండి:
తాజా మటన్ తేలికపాటి తాజా వాసన కలిగి ఉంటుంది. మటన్ పుల్లగా లేదా పుల్లటి వాసన వస్తే, అది చెడిపోయినట్లే. పాడైపోయిన మటన్ బలమైన, అసహజమైన వాసన కలిగి ఉంటుంది. కాబట్టి, కొనుగోలు చేసే ముందు దాని వాసన చూడండి.
మటన్ పై కాస్త నొక్కి చెక్ చేయండి:
మటన్ పై సున్నితంగా నొక్కినప్పుడు అది వెంటనే తిరిగి దాని స్థానంలోకి వస్తే, అది తాజాగా ఉన్నట్టు. అలా కాకుండా మటన్‌ను కొద్దిగా నొక్కినప్పుడు అది దాని స్థానం మార్చుకుని, అందులోంచి నీటి ద్రవం బయటకు వస్తే, అది చెడిపోయినట్లు అర్థం చేసుకోవాలి.
కొవ్వు పొరను తనిఖీ చేయండి:
మంచి మటన్‌లోని కొవ్వు తెల్లగా, మృదువుగా ఉంటుంది. కొవ్వు పసుపు లేదా గట్టిగా కనిపిస్తే, అది పాతదని అర్థం. తాజా మటన్‌లోని కొవ్వు సులభంగా కట్ అవుతుంది. కొద్దిగా మృదువుగా ఉంటుంది.
ఎక్కువగా మెరిసే మటన్‌ను నివారించండి:
తరచుగా దుకాణదారులు మటన్‌ను మెరిసేలా చేయడానికి రసాయనాలు లేదా రంగులను ఉపయోగిస్తారు. అలాంటి మటన్ తాజాగా కనిపించవచ్చు. కానీ, వాస్తవానికి అది చెడిపోతుంది. మీరు మటన్‌పై అసహజమైన మెరుపు, జిడ్డుగా ఉండటం గమనించినట్లయితే దానిని తీసుకోకుండా ఉండటం ఉత్తమం.
మీకు నమ్మకమైన దుకాణంలో మాత్రమే కొనండి:
ఎప్పుడూ మీరు శుభ్రంగా, పరిశుభ్రంగా ఉండే మటన్ కొనండి. దుకాణంలో ఈగలు, దుర్వాసనలు లేకుండా ఉండాలి. తాజా మటన్‌ను ఎల్లప్పుడూ రిఫ్రిజిరేటర్‌లో లేదా చల్లని ప్రదేశంలో నిల్వ చేయాలి.
ప్యాక్డ్ మటన్ కొనేముందు:
ప్యాక్ చేసిన లేదంటే, ఫ్రోజెన్ చేసిన మటన్ కొనుగోలు చేసేటప్పుడు తేదీ, ప్యాకేజింగ్ చెక్ చేయండి.
మీరు సూపర్ మార్కెట్ నుండి ప్యాక్ చేసిన మటన్ కొనుగోలు చేస్తుంటే, తయారీ గడువు తేదీలను చెక్ చేసుకోండి. ప్యాకేజీలో ఐస్ పీసెస్, లీకులు లేకుండా చూసుకోండి. లేకుంటే మటన్ నాణ్యత తగ్గింది ఉండవచ్చు.
మేక వయస్సును గుర్తించండి:
చిన్న మేకల మటన్ ఎక్కువ మృదువుగా, రుచిగా ఉంటుంది. పెద్ద మేకల మటన్ గట్టిగా ఉంటుంది. ఉడికించడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. లేత మటన్ గుర్తించడానికి సన్నగా ఉండే ఎముకలు, లైట్ కలర్‌లో ఉండేలా చూసుకోండి. గులాబీ, ఎరుపు మధ్య రంగులో ఉండే మటన్ అయితేనే ఆరోగ్యానికి మంచిది.
మీకు అవసరమైనంత మాత్రమే మటన్ కొనండి:
డిస్కౌంట్ ఉందని ఎక్కువ మటన్ కొనాలనే పొరపాటు చేయకండి. ఎక్కువ కాలం నిల్వ ఉంచిన మటన్ రుచి, పోషకాలను కోల్పోతుంది. కాబట్టి, మీకు అవసరమైనంత మాత్రమే కొనండి.
వంట చేసే ముందు కూడా పరిశుభ్రత:
మటన్‌ను చల్లటి నీటిలో బాగా కడిగి, వండడానికి ముందు వెనిగర్ లేదా నిమ్మరసంలో కొద్దిసేపు నానబెట్టండి. ఇది బ్యాక్టీరియాను చంపి మటన్‌ను మరింత రుచికరంగా చేస్తుంది. అలాగే, చాలామంది బోన్‌లెస్ మటన్ తినేందుకు ఇష్టపడుతుం టారు. నిజానికి బోన్‌లెస్ కన్నా కూడా బోన్ మటన్ రుచిగా ఉంటుంది. బోన్స్ ఉన్న మటన్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. పైగా బొక్కలు ఉన్న మటనే త్వరగా ఉడుకుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..