భారత్‌తో నేరుగా పోరాడే సామర్థ్యం లేకపోయినా పహల్గామ్ తరహా దాడులకు పాకిస్థాన్ మళ్ళీ ప్రయత్నించవచ్చని పశ్చిమ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ అన్నారు. అదే జరిగితే ఆపరేషన్ సిందూర్ 2.0 మరింత భయంకరంగా ఉంటుందని హెచ్చరించారు. వెయ్యి కోతలతో భారతదేశాన్ని రక్తసిక్తం చేయడం అనే విధానాన్ని పాకిస్తాన్ కొనసాగిస్తోందని, అయితే అలాంటి ప్రయత్నాలను ఎదుర్కోవడానికి భారత సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్ 2.0
ఈ సారి మనం తీసుకునే చర్య గతంలో కంటే ప్రాణాంతకంగా ఉంటుంది. ఆపరేషన్ సిందూర్ 2.0 మొదటి దానికంటే మరింత శక్తివంతంగా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు అని లెఫ్టినెంట్ జనరల్ కటియార్ విలేకరులతో అన్నారు.
భవిష్యత్తులో పాకిస్తాన్ పహల్గామ్ తరహా దాడులు చేస్తుందా అని అడిగిన ప్రశ్నకు పాకిస్తాన్ ఆలోచనలో మార్పు రానంత వరకు, అది ఇలాంటి దుశ్చర్యలను కొనసాగిస్తుందని ఆయన అన్నారు. మాతో యుద్ధం చేసే సామర్థ్యం దానికి లేదు. వారు యుద్ధం చేయడానికి ఇష్టపడరు. ‘వెయ్యి కోతలతో భారతదేశాన్ని రక్తసిక్తం చేయడం’ అనే విధానం ప్రకారం అది దుశ్చర్యలకు పాల్పడుతుంది” అని ఆయన అన్నారు.
ఆపరేషన్ సిందూర్‌లో భారత్ పాకిస్తాన్‌కు భారీ నష్టాన్ని కలిగించిందని పశ్చిమ ఆర్మీ కమాండర్ అన్నారు. మేము పాక్ పోస్టులను, వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాం, అయినా కూడా పాక్ మళ్ళీ పహల్గామ్ దాడి లాంటిదానికి ప్రయత్నించవచ్చు. మనం సిద్ధంగా ఉండాలి. మనం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం కూడా. ఈసారి చర్య గతంలో కంటే ఘోరంగా ఉంటుందని నాకు నమ్మకం ఉంది అని ఆయన అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి