విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు కోసం మంగళవారం ఏపీ ప్రభుత్వం, గూగుల్ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు కింద విశాఖలో వచ్చే ఐదేళ్లలో గూగుల్ లక్షా31 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. దీనిపై వివిధ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ దీనిపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయం తెలియజేశారు. ఇదో గొప్ప విజయంగా అభివర్ణించిన జయప్రకాష్ నారాయణ.. రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలతో పాటుగా ఆర్థిక అంశాల నిర్వహణపైనా దృష్టి సారించాలని సూచించారు.

*గూగుల్ డేటా సెంటర్.. అమరావతిని కాదని.. విశాఖలోనే ఎందుకు?
“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక అభినందనలు. గూగుల్ ఏఐ హబ్‌ను విశాఖపట్నానికి తీసుకురావడం గొప్ప విజయం. ఇది భారతదేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన దిశగా గొప్ప అడుగు. దీనిని సులభతరం చేసినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. అయితే పెట్టుబడులు, మౌలిక సదుపాయాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులపైనా దృష్టి పెట్టాలి. రాబోయే కొన్ని సంవత్సరాల పాటు.. ఖర్చులను తగ్గించుకోవటంపై దృష్టి పెట్టాలి. “
ప్రతి వారం ఒక గుడ్ న్యూస్ చెబుతాం.. రెడీగా ఉండండి: మంత్రి లోకేష్
“ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఆదాయాలు కూడా తదనుగుణంగా పెరుగుతాయి. అయితే ఖర్చులను కొన్ని సంవత్సరాలు స్తంభింపజేయడం వల్ల పబ్లిక్ డెబిట్ నిర్వహించేందుకు వీలవుతుంది. ప్రస్తుతం, ఆఫ్ బడ్జెట్ రుణాలు, చెల్లించని బిల్లులను చేర్చినప్పుడు, రుణ-జిఎస్‌డిపి నిష్పత్తి 60 శాతం మించిపోయింది. పెట్టుబడిని ఆకర్షించడంలో, మౌలిక సదుపాయాలను నిర్మించడంలో మాదిరిగానే ఆర్థిక నిర్వహణ, వనరులను వివేకవంతంగా ఉపయోగించడంలో ప్రభుత్వం అదే చైతన్యాన్ని చూపిస్తుందని నేను ఆశిస్తున్నా” అంటూ జయప్రకాష్ నారాయణ ట్వీట్ చేశారు.
మరోవైపు గూగుల్ – ఏపీ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వచ్చే ఐదేళ్లలో గూగుల్ ఏపీలో రూ.1.31 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుచేయనుంది. ఈ ప్రాజెక్టు పెట్టుబడి వ్యయం ప్రస్తుతానికి రూ.87,250 కోట్లుగా గూగుల్ ప్రకటించింది. అయితే దీనిని 15 బిలియన్ డాలర్లకు తీసుకెళ్తామని వెల్లడించింది. గూగుల్ ఏఐ హబ్ ద్వారా విశాఖపట్నం నుంచి సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా వంటి 12 దేశాలతో అనుసంధానం చేస్తూ సబ్ సీ కేబుల్ ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు గూగుల్ ఏఐ హబ్ ద్వారా సుమారుగా 1,88,220 ఉద్యోగాలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.