
మరోవైవపు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా పింఛన్ పంపిణీ ఒకటి, రెండు తేదీల్లో ఉంటుంది. ఒకవేళ మొదటి రోజు (ప్రతి నెలలో ఒకటో తేదీ సాధారణ సెలవు / ఆదివారం అయితే గత నెల (అంతకు ముందు నెల) చివరి పని దినం రోజు పింఛన్ పంపిణీ చేస్తారని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ రెండవ రోజు (రెండో తేదీ) సాధారణ సెలవు / ఆదివారం అయితే ఆ తర్వాత వచ్చే పని దినం నాడు పింఛన్ పంపిణీ ఉంటుంది. అందుకే అక్టోబర్ 2న గాంధీ జయంతి సెలవు దినం కావడంతో.. ఆ తర్వాత రోజు (అక్టోబర్ 3)న పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. అంతేకాదు ఇటీవల వర్షాలు, వరదల కారణంగా కొందరు లబ్ధిదారులు సెప్టెంబర్ నెలలో పింఛన్ అందుకోలేకపోయారు.. వారిని రెండు నెలలు కలిపి పింఛన్ డబ్బుల్ని పంపిణీ చేశారు.
ప్రతి నెలా ఒకటో తేదీన పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అద్భుతం జరిగిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 1వ తేదీ రోజునే ఏకంగా 98 శాతం మంది లబ్దిదారులు ఇంటి దగ్గరే పింఛను అందించడం ఎంతో సంతృప్తినిచ్చింది అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. పేదలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతోనే పింఛన్లను పెంచి అందజేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు 64.38 లక్షల మందికి పింఛను అందించే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో పింఛన్లు అందించిన సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, వార్డు వాలంటీర్ల స్థానంలో.. సచివాలయాల ఉద్యోగులు ప్రతి నెలా ఒకటో తేదీ పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల సిబ్బంది తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 98 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు ఉద్యోగులు. ప్రతి నెలా ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. వారే స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్నారు.

