నకిలీ ఐపీఎస్ అధికారిని తిరుపతిలోని అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తిని మోసం చేసిన కేసులో దర్యాప్తు జరిపిన పోలీసులు..ఈ నకిలీ ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎస్ అధికారి పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేస్తున్నట్లు గుర్తించారు. కోర్టు ఎదుట హాజరుపరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి వారిని నమ్మొద్దని యువతకు సూచించారు.

ఈ క్రమంలోనే రెండు నెలల కిందట సురేష్ కుమార్ అనే వ్యక్తి వెంకటేశ్వర్లుకు పరిచయం అయ్యారు. తాను ఐపీఎస్ ఆఫీసర్‌ను అని ఢిల్లీలో NIAలో పనిచేస్తున్నానంటూ సురేష్ కుమార్.. వెంకటేశ్వర్లుతో పరిచయం పెంచుకున్నాడు. ఇటీవలే ప్రమోషన్ మీద హైదరాబాద్‌కు బదిలీ అయ్యిందని నమ్మించాడు. తిరుపతిలో తమ పిన్ని వాళ్లు ఉన్నారని.. సెలవులలో భాగంగా తిరుపతికి వచ్చినట్లు వెంకటేశ్వర్లుకు నమ్మబలికాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలో డివిజన్ అడ్వైజర్ ఉద్యోగం ఇప్పిస్తానని వెంకటేశ్వర్లకు చెప్పాడు. రీప్లేస్‌మెంట్ కోటాలో వెంకటేశ్వర్లుకు ఆ ఉద్యోగం వచ్చేలా చూస్తానన్న సురేష్ కుమార్.. అతని వద్ద నుంచి ఒకటిన్నర లక్షల రూపాయలు వసూలు చేశాడు.
అయితే డబ్బులు తీసుకున్న తర్వాత ఉద్యోగం రాకపోవటం, ఇదే విషయం మీద ప్రశ్నిస్తే సురేష్ కుమార్ మొహం చాటేస్తూ ఉండటంతో వెంకటేశ్వర్లుకు అనుమానం కలిగింది. తాను మోసపోయానన్న విషయం అర్థమై.. అలిపిరి పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే సురేష్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. కోర్టు ఎదుట హాజరుపరిచిన అనంతరం.. రిమాండ్‌కు తరలించారు.
ఈ సందర్భంగా ఇలాంటి నకిలీ అధికారులను నమ్మి మోసపోవద్దని పోలీసులు యువతకు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైనా పోటీ పరీక్షల ద్వారా, బోర్డుల ద్వారా నిర్వహిస్తారని.. ఇలా మధ్యవర్తులు, నకిలీ అధికారుల మాటలు విని మోసపోవద్దని సూచిస్తున్నారు. ఎవరైనా ఇలా మోసపోతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని.. లేకపోతే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.


