దేశవ్యాప్తంగా ఉన్న పలు సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు, ఐఐటీలు (IITs), ఎన్ఐటీలు (NITs), ఆర్‌ఐఈ (RIEs) వంటి మొత్తం 64 జాతీయ విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ITEP) కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటన వెలువరించింది. ఈ ఏడాది అన్ని విద్యా సంస్థల్లో మొత్తం 6 వేల వరకు ఐటీఈపీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. NCET 2026 పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి ఆయా విద్యాసంస్థల్లో ప్రవేశాల బీఏ-బీఈడీ, బీకాం-బీఈడీ, బీఎస్సీ-బీఈడీ కోర్సుల్లో సీట్లు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా 13 భాషల్లో ఆన్‌లైన్ విధానంలో పలు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకునే వారికి నాణ్యమైన శిక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల ఏళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్(ITEP) కోసం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (NCET) 2026 నిర్వహిస్తుంది.
ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 12వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లేదంటే 2026లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాయబోయే విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 12, 2026వ తేదీ నుంచి మార్చి 10, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1000, జనరల్ అభ్యర్ధులు రూ.1200, ఎస్సీ, ఎస్టీ, పీడ్ల్యూబీడీ, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.650 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. మార్చి 11, 2026వ తేదీ వరకు దరఖాస్తు ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. మార్చి 12 నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తు సవరణకు అవకాశం ఉంటుంది. ఇక రాత పరీక్ష ఏప్రిల్ 7, 2026వ తేదీన దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు.
రాత పరీక్ష విధానం ఇలా..
ఆన్‌లైన్ విధానంలో జరిగే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 పరీక్ష అబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో ఉంటుంది. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. భాషలు, రీడింగ్ కాంప్రహెన్షన్, లిటరరీ ఆప్టిట్యూడ్, వొకాబులరీ సబ్జెక్టుల్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది. 12వ తరగతి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్.. విభాగాల నుంచి జనరల్ టెస్ట్ పరీక్ష ఉంటుంది. సైన్స్, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ భాషల బోధనకు సంబంధించిన అంశాల నుంచి టీచింగ్ ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహిస్తారు.
ఇవి కూడా చదవండి
నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

