Andhra Pradesh Ntr Bharosa New Pensions: ఏపీలో కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే వృద్ధాప్య, వితంతు కొత్త పింఛన్లు ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందించామని.. త్వరలోనే కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు. అప్పుడు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పింఛన్ కూడా తొలగించలేదన్నారు మంత్రి.
హైలైట్:
- ఏపీలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన
- ఒక్క పింఛన్ కూడా తొలగించలేదన్నమంత్రి

ఇప్పటి వరకు 1.40 లక్షల మంది అనర్హుల్ని గుర్తించి నోటీసులు జారీ చేశామన్నారు. అయినా వారందరికి పింఛన్లు కొనసాగిస్తున్నామన్నారు. మరోసారి పరిశీలన కార్యక్రమం చేపట్టామని. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధాప్య, వితంతు కొత్త పింఛన్లు ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందించామన్నారు. కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు త్వరలోనే అవకాశం కల్పిస్తామన్నారు. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించాలని భావించింది.. కానీ కొన్ని సమస్యల కారణంగా ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం దివ్యాంగ పింఛన్లలో అనర్హుల ఏరివేతపై ఫోకస్ పెట్టారు.. ఆ ప్రక్రియ పూర్తయ్యాక కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ కూడా పింఛన్ల అంశాన్ని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్న వృద్ధులు, వితంతువులకు ఒక్క కొత్త పింఛనైనా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి దీనికి సమాధానం లేదన్నారు. తల్లికి వందనం పథకం కింద రూ.15వేలు ఇప్పటికి కొందరు విద్యార్థులకు అందలేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు భారీగా ఉన్నాయన్నారు.


