Jaahnavi Kandula Father Died: అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన జాహ్నవి కందుల కుటుంబంలో మరో విషాదం జరిగింది. జాహ్నవి తండ్రి శ్రీకాంత్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కూతురికి సియోటల్ ప్రభుత్వం పరిహారం చెల్లిస్తున్న విషయం తెలియక ముందే ఆయన చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా గుండెపోటుతో కన్నుమూశారు. శ్రీకాంత్ మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది.
హైలైట్:
- జాహ్నవి కందుల కుటుంబంలో విషాదం
- ఆమె తండ్రి కందుల శ్రీకాంత్ మృతి
- గుండెపోటుతో చనిపోయిన శ్రీకాంత్

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన శ్రీకాంత్ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.. ఆయన భార్య పేరు విజయలక్ష్మి. ఈ దంపతులకు జాహ్నవి, మేఘన కుమార్తెలు కాగా.. జాహ్నవి పెద్ద కుమార్తె. ఆమె ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికాలోని సియాటెల్ వెళ్లారు.. అక్కడ నార్త్‌ఈస్ట్రన్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నారు. జాహ్నవి 2023 జనవరి 23న రాత్రి రోడ్డు దాటుతున్న సమయంలో.. పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జాహ్నవి అక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయంలో పెట్రోలింగ్ వాహనాన్ని పోలీసు అధికారి కెవిన్ డేవ్ నడుపుతున్నారు. అతడు ఓవర్ స్పీడ్‌తో వాహనాన్ని నడిపాడు.. 40 కిమీ వేగంగా వెళ్లాల్సిన చోట 119 కిమీ వేగంగా వెళ్లి జాహ్నవిని ఢీకొట్టాడు. పాపం ఆమె 100 అడుగుల దూరం ఎగిరిపడ్డారు.
ఈ ప్రమాదం తర్వాత ఆ పోలీస్ అధికారి జాహ్నవి గురించి దారుణంగా మాట్లాడాడు.. ఆమె మరణానికి విలువ లేదన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. బాడీ కెమెరాలో వీడియోలో అతడి మాటలు రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత కెవిన్ తీరుపై విమర్శలు రావడంతో విధుల నుంచి తొలగించారు. అప్పటి నుంచి జాహ్నవి తండ్రి న్యాయ పోరాటం కొనసాగుతోంది.. అలాగే తెలుగు సంఘాలు కూడా ఆ కుటుంబానికి అండగా నిలిచాయి. తాజాగా జాహ్నవి కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (రూ.262.75 కోట్లు) పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ కీలక ప్రకటన విడుదల చేశారు. జాహ్నవి మరణం బాధాకరమని ఎరికా ఇవాన్స్ అన్నారు. ఆమె కుటుంబానికి ఈ పరిహారంతో కొంతైనా రిలీఫ్ ఉంటుందని ఆశిస్తున్నాను అన్నారు. అయితే ఈ పరిహారం ప్రకటించే ముందే జాహ్నవి తండ్రి చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.


